తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. యువగళం యాత్రలో భాగంగా మాచర్లలో జరిగిన సభలో తనపై ఆయన పలు ఆరోపణలు చేశారని… వెయ్యికోట్ల రూపాయల అవినీతి చేసినట్లు…. 50 ఎకరాలు దోచుకున్నట్లు చెప్పారని, కానీ 50 గజాలు కూడా ఆక్రమించలేదని,… మట్టి అమ్ముకుంటున్నట్లు కూడా లోకేష్ ఆరోపించారని పిన్నెల్లి మండిపడ్డారు. నిజంగా చంద్రబాబు రక్తం పంచుకుని పుడితే వీటిని లోకేష్ నిరూపించాలన్నారు. ఏపీలో కనీసం సొంత ఇళ్ళు కూడా లేకుండా హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి టిడిపికి భంగపాటు తప్పదని అయ్యా కొడుకులు హైదరాబాద్ లో తలదాచుకుంటారని బాబు, లోకేష్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
టెంట్ హౌస్ ను అద్దెకు తెచ్చుకున్నట్లు ఒక కిరాయి వ్యక్తిని మాచర్లకు ఇన్ ఛార్జ్ గా పెట్టి, అతణ్ణి చూసి నేనేదో భయపడుతున్నట్లు లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాకు లాగులు తడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై పిన్నెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో మా ఆర్కే నీకు పోయించి పంపించాడంటూ ప్రతిస్పందించారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు తెలుగుకొని మాట్లాడాలన్నారు. పల్నాడు గడ్డపై 30 ఏళ్ళుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, వరుసగా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 2004, 2009 అతన్ని ఇక్కడ నుంచి రాజకీయంగా తరిమేశామని, ఒక సారి చరిత్ర తెలుసుకోవాలని పిన్నెల్లి హితవు పలికారు. జూలకంటి నాగిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన కొడుకైన బ్రహ్మారెడ్డి కనీసం తండ్రికి అన్నం పెట్టలేదని అన్నారు.
లోకేష్ చిన్నా, పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని…. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత వయసు లోకేష్ కు లేదని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. అనవసర, పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.