అధికారం, పదవులు లేకుండానే ప్రజలకు ఎంతో కొంత మేలు చేశానని, గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పులను కొన్నిటినైనా ఆపి ఉండేవాడినని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సిల్క్ రైతుల సమస్యల కోసం గొల్లప్రోలు వెళ్తానంటే ఏడు కోట్ల రూపాయల బాకీల్లో మూడు కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, పవన్ సభకు వెళ్ళవద్దని సంబందిత రైతులను అడిగారని పవన్ ఆరోపించారు. తనకు ప్రజాబలం ఉంటేనే ప్రభుత్వం ఇంత గడగడలాడుతోందని, అధికారం ఇస్తే ఎంత మేరకు చేస్తానో ఆలోచించాలని కోరారు. పవన్ వారాహి యాత్ర పిఠాపురం చేరుకుంది, ఉప్పడ జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తనకు ప్రసంగాలు రాసిచ్చేవారు ఎవరూ లేరని, రోజుకు కనీసం 5 నుంచి 8 గంటల పాటు చదువుతూనే ఉంటానని, పబ్లిక్ పాలసీ పై అవగాహన పెంచుకుంటానని, మేధావులతో మాట్లాడుతుంటానని, క్షేత్ర స్థాయిలో తిరుగుతానని, సమస్యను అర్ధం చేసుకొని ఆకళింపు చేసుకుంటానని వివరించారు. ముఖ్యమంత్రి కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, 2019 ఎన్నికల్లో ఈ మాట చెప్పలేకపోయానని, ఈ ధైర్యం చేయలేకపోయానని, అప్పట్లో తనకు సెల్ఫ్ డౌట్ ఉందన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతున్నానని, తనకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ను అత్యంత ఉన్నతమైన, నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని పవన్ భరోసా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహం అయినా వేస్తానని, గుండా గాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే దానికీ, పబ్లిక్ పాలసీ మీద చర్చకు సిద్ధంగా ఉన్నాయని… కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవసరమైతే ఇళ్ళలోంచి లాక్కొచ్చి కూడా కొడతానని హెచ్చరించారు. పేర్ని నాని నిన్న జరిగిన మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపించిన ఘటనపై పవన్ పరోక్షంగా స్పందిస్తూ మొన్న అన్నవరం గుళ్ళోకి వెళ్ళినప్పుడు తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారంటూ సెటైర్లు వేశారు. తనకు మతపిచ్చి లేదని, సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పారు. తాను ఆంధ్ర ప్రదేశ్ విడిచి వెళ్లబోనని స్పష్టం చేశారు.