చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్షా లేదని, ఆయన అరెస్టు వెనుక తన ప్రమేయం లేదని.. పైగా తాను లండన్ లో ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు ఎత్తారు(అరెస్టు చేశారు) అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ కక్ష సాధింపు ఉండి ఉంటే… కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది, బాబు దత్తపుత్రుడు బిజెపితో ఉన్నానని చెబుతున్నాడని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుతో పాటు సగం మంది బిజెపి రాష్ట్ర నేతలు టిడిపి మనుషులే ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఐటి, ఈడి బాబుపై విచారణ జరిపి ఆయన అవినీతిని తేటతెల్లం చేశారని, ఈడి కేసు నమోదు చేసే నాటికి తాము రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారని, అందుకే ఆ సమయంలో చంద్రబాబు సిబిఐ, ఈడి లకు రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారని జగన్ వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సమావేశంలో సిఎం జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బాబును సమర్ధించడం అంటే ఈ రాష్ట్రంలోని పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడం, పేదవాడికి వ్యతిరేకంగా ఉండడం… పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్ధించడం అన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీ పెట్టి పదేళ్ళయినా ఇప్పటి వరకూ అన్ని నియోజకవర్గాల్లో జెండా మోసే కార్యకర్తలు కూడా లేరంటూ పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యంగాస్త్రం విసిరారు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజాన వేసుకొని మోయడానికే ఆయన సమయం సరిపోయిందన్నారు, చంద్రబాబు చేసిన మాసాల్లో, దోచుకున్న దాంట్లో పార్ట్ నర్ అంటూ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి ఎలా మోసం చేయాలనే ఆలోచిస్తున్నారన్నారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సిఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు వివరిస్తూ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికాలు వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని హితవు చెప్పారు.