I don’t want mentorship: తెలుగు సినిమా పెద్దరికం తనకొద్దని, మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. పెద్దరికం అనేది ఒక హోదా అనిపించుకోవడం తనకు ససేమిరా ఇష్టం లేదని తేల్చి చెప్పారు. తాను పెద్దగా ఉండబోనని.. కానీ పరిశ్రమకు బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటానని, అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తానని భరోసా ఇచ్చారు.
యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు హెల్త్ కార్డులు అందజేశారు. ఈ కార్డుల ద్వారా వైద్య పరీక్షలకు యోధ సంస్థ యాభై శాతం రాయితీ అందించనుంది. ప్రస్తుతం 18 యూనియన్లకు సంబంధించిన కార్మికుల కోసం 7700కార్డులు సిద్ధం చేశారు, నేడు ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ సినీ కార్మిక సంఘం నేత మాట్లాడుతూ చిరంజీవి పరిశ్రమలోని 24 క్రాఫ్టులకు సంబంధించి ఒక పెద్దగా ఉండాలని, ఏదైనా ఒక సమస్య వస్తే అయన ఉన్నారన్న భరోసా ఉంటుందని, దీనికి అంగీకరించాలని కోరారు. దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అనవసర విషయాల్లో తగదునమ్మా అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదన్నారు. అవసరం అయినప్పుడు ఏ క్షణమైనా, సంక్షోభం వచ్చినప్పుడు, భుజం కాయాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తన చేదోడు వాదోడు మనస్పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరో ఇద్దరు కొట్టుకుంటుంటే వచ్చి అలాంటి తగాదాలు తీర్చేది లేదని, రెండు యూనియన్లు దృష్టిలో పెట్టుకునో.. ఇద్దరు వ్యక్తులని దృష్టిలో పెట్టుకునో తనను పంచాయతీ చేయమంటే చేయబోనని, ఆ రకమైన పెద్దరికం తనకొద్దని ఖరాఖండిగా చెప్పారు.
Also Read : అయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!