అక్కా చెల్లెమ్మలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తుంటారని… ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి అయితే గ్రహపాటు.. అంతేకానీ మూడోసారి, నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని నిలదీశారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏదైనా ఒక పనికోసం మహిళలు ఈ దత్తపుత్రుడిని కలిసే పరిస్థితి ఎలా ఉంటుందని అడిగారు. ఈ ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో జరిగిన చివరి ప్రచార సభలో పవన్ పై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలు ఈ దత్తపుత్రుడికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటాడా? ఈ పెద్ద మనిషికి మొన్న ఈమధ్య జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడు.. గత ఎన్నికల్లో గాజువాక అయిపొయింది, భీమవరం అయిపొయింది, ఇప్పుడు పిఠాపురం.. ఇలాంటి వ్యక్తికి ఓటువేస్తే నిజంగా న్యాయం జరుగుతుందా అనేది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీతో తన తల్లి లాంటి, అక్క లాంటి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సిఎంగా చేసి పిఠాపురం పంపిస్తానని, ఇక్కడి ప్రజల మంచి కోసం, అభివృద్ధి కోసం ఆమెకు పదవి ఇచ్చి మంచి చేయిస్తానని ప్రకటించారు.