Sunday, January 19, 2025
HomeTrending NewsJogi Comments: పవన్ తో సినిమాలు తీస్తా: జోగి

Jogi Comments: పవన్ తో సినిమాలు తీస్తా: జోగి

పెడనలో పవన్‌ బహిరంగసభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదని, ఆయనవి అన్నీ గాలి మాటలని తేలిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. ఏదో చేసేయాలని చాలా తాపత్రయపడ్డాడని, 2 వేల మంది గుండాలను పోగు చేస్తున్నామని… రాళ్ల దాడి జరుగుతుందని… కత్తులు, కటార్లతో దాడికి ప్లాన్‌ చేస్తున్నారని పవన్ ఆవేశంగా ఆరోపణలు చేశారని జోగి విమర్శించారు.
టిడిపితో పొత్తు పెట్టుకున్న తర్వాత జరుగుతున్న వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతారని పవన్‌ భావించాడు. కానీ అవనిగడ్డలో జరిగిన తొలి సభలో జనం ఆదరించలేదని, దీంతో అటెన్షన్‌ క్రియేట్‌ చేయడం కోసమే పెడనలో దాడికి ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారని, కానీ పెడనలో కూడా ఆయన సభ అట్టర్‌ఫ్లాప్‌ అయిందని జోగి అన్నారు.
” జనసేన, తెలుగుదేశం కలయిక వాక్సిన్‌ అని పవన్ అంటున్నాడు. కానీ ప్రజలు అది ఒక వైరస్‌ అన్నారు. అంతే కాకుండా ఆ కలయిక పాయిజన్‌తో సమానం అని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. 2014లో మీ ఇద్దరి కలయిక, మీ ఇద్దరి బంధం, మీ ఇద్దరు ఏ విధంగా అందరినీ మోసం చేసింది, దగా చేసింది అన్నది అందరూ చూశారు. నీ దత్తతండ్రి చంద్రబాబు ఏ విధంగా స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేశాడనేది అందరూ గుర్తించారు. సూట్‌కేస్‌ కంపెనీలు, హవాలా వ్యవహారాలు అన్నీ ఆధారాలతో సహా పట్టుబడి, ఈరోజు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు నీ దత్తతండ్రి.  ఆయనకు మద్దతుగా నీవు జైలుకు వెళ్లి, ములాఖత్‌ అయి, ఆ తర్వాత మిలాఖత్‌ అయ్యావు. బయటకు వచ్చి, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించావు. ఆ తర్వాత నీవు చేపట్టిన వారాహి మరో విడత యాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తారని ఆశించావు. కానీ నీకు ఎక్కడా ఆ ఆదరణ లభించడం లేదు” అంటూ మండిపడ్డారు.
పవన్  రూపాయి పావలా వ్యాఖ్యలపై కూడా జోగి తీవ్రంగా ప్రతిస్పందించారు.  ఆయనకు పావలా కళ్యాణ్‌ అన్న పేరు ఉందని, ఆ పేరు పెట్టారన్న ఉక్రోషంతోనే రూపాయి పావలా ప్రభుత్వం అంటున్నారని, అయిదు పావలాలు అయితే రూపాయి పావలా. ఇందులో మొదటి పావలా చంద్రబాబు. రెండో పావలా పవన్‌కళ్యాణ్‌. మూడో పావలా ఎల్లో మీడియా. నాలుగో పావలా మిగతా పార్టీల్లో ఉన్న కోవర్టులు. అయిదో పావలా జేఏసీల పేరుతో పెట్టుకున్న సంస్థలు. ఈ అయిదు పావలాలు కలిసిన సున్నా ఇంటు సున్నా. సున్నా ప్లస్‌ సున్నా ఎంత విలువ ఉంటాయో.. వీరికి అంతే విలువ ఉంది. సన్నాసులకు, సున్నాసులకు ప్రజా సేవ తెలియదు.. అదీ మీ రాజకీయం అంటూ ధ్వజమెత్తారు,.
“పవన్‌ నిన్న పెడనలో నామీద అవినీతి ఆరోపణలు చేశాడు. కానీ అక్కడ టీడీపీ, జనసేన నాయకులు అంతా కలిసి ప్రయత్నించినా, ఆ సభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదు. మరి ప్రజలు నాతో ఉన్నారా? లేక పవన్‌ను ఆదరిస్తున్నారా?. ఆలోచించండి. నన్ను అండమాన్‌ జైలుకు పంపిస్తాను అని పవన్‌ అన్నాడు. పవన్, నీకో విషయం చెబుతున్నా. 2024 తర్వాత నీవు రెడీగా ఉండు. నీతో నేను రెండు సినిమాలు తీస్తాను. జానీ–ఖూనీ. గబ్బర్‌సింగ్‌–రబ్బర్‌సింగ్‌ . ఈ రెండు సినిమాలు తీస్తాను. ఎందుకంటే, ఆయన అప్పుడు సినిమాలు మాత్రమే చేసుకోవాలి  కాబట్టి” అని మంత్రి జోగి రమేశ్‌ వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్