తమ నాయకుడు చంద్రబాబును, తనను జైలుకు పంపడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి తప్పులు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. నీతి, నిజాయతీగా బతికామని అందుకే ఇప్పటి వరకూ తమపై ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.
వైసిపి నేతలు తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ దాఖలు చేసిన క్రిమినల్ కేసుల్లో మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేష్ వాంగ్మూలం ఇచ్చారు. యువ గళం పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి మరీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియా తో లోకేష్ మాట్లాడారు.
పింక్ డైమండ్, ఆరు లక్షల కోట్ల అవినీతి, ఫైబర్ గ్రిడ్, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, పిన్నిని ఆస్తి తగాదాల వల్ల తాను వెళ్లి ఇబ్బందులు పెడితే ఆమె చనిపోయారని, తన తల్లి, భార్య, కుమారుడు దేవాన్ష్ లపై కూడా ఆరోపణలు చేసి ట్రోల్ చేశారని, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో 25 లక్షల రూపాయల తిన్నానని సాక్షి పత్రిక రాసిందని లోకేష్ వివరించారు. భారత దేశ చరిత్రలో ప్రతి ఏటా పారదర్శకంగా ఆస్తులు ప్రకటించే ఏకైక కుటుంబ తమదేనని చెప్పారు. తనపై చేసిన అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అందరిపైనా పరువునష్టం కేసు దాఖలు చేస్తామని, న్యాయ పోరాటం చేసి కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. తమపై తప్పుడు రాతలు రాయాలంటే భయపడాలని వ్యాఖ్యానించారు.