కాకినాడ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్ధిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తనకు లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నుంచి పలు పార్టీల కార్యకర్తలు, నేతలు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో అ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడిన పవన్ తమ పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలిపిస్తే దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేస్తామని స్పష్టం చేశారు.
ఒకవేళ నరేంద్ర మోడీ, అమిత్ షా కోరితే తాను కాకినాడ నుంచి ఎంపిగా పోటీ చేస్తానని అప్పుడు ఉదయ్ పిఠాపురం అసెంబ్లీ బరిలో ఉండారని పరస్పరం సీట్లు మార్చుకుంటామని అన్నారు. కేంద్ర పెద్దలు తనను ఎంపిగా, ఎమ్మెల్యేగా రెండిటికీ పోటీ చేయాలని అడిగారని కానీ తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని… ముందు రాష్ట్రానికి పనిచేసి ఆ తర్వాత దేశానికి పనిచేయాలని ఉందని తన మనోగతాన్ని వెల్లడించారు.
ఓట్లు వేయమని అడగడం లేదని, అర్ధిస్తున్నానని, పదేళ్ళపాటు పార్టీని నడిపిన తరువాత ఈసారి మానసికంగా సిద్ధపడిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతున్నానని, భారీ విజయం అందించాలని కోరారు. పిఠాపురం నుంచి మన జైత్ర యాత్రను మొదలుపెట్టుకుంటూ వెళదామని అన్నారు. ఈ మీటింగ్ చూస్తుంటే తనకు ఒకటే అనిపిస్తోందని పిఠాపురం ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉందని, ఎలాగూ గెలుస్తున్నామని వ్యాఖ్యానించారు.