స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల 30 లక్షల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి తమ విధానం తెలియజెప్పామని, సిఎం జగన్ పలుసార్లు కేంద్ర మంత్రులు, ప్రధానికి కలిసి ఈ విషయమై విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. తాము బిడ్ లో పాల్గొంటే ప్రైవేటీకరణను అంగీకరిస్తున్నట్లే అవుతుంది కదా అంటూ మంత్రి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనలకు తమ పార్టీ అండగా నిలిచిందని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనేందుకు తెలంగాణా ప్రభుత్వం సింగరేణి కాలరీస్ తరఫున ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ చూపించడంపై నేడు ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని బిఆర్ఎస్ చెప్పిందని, ఇప్పుడు బిడ్ లో పాల్గొంటామని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అంగీకరిస్తున్నట్లే అవుతుందని అమర్నాథ్ పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ గొడవలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై రుద్దడానికి ప్రయతిస్తున్నారని ఆరోపించారు. బిజెపిని టార్గెట్ చేయడానికే బిఆర్ఎస్ ఈ బిడ్ లో పాల్గొంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ఓ మేమో ఇచ్చిందని, దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదని… ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలనేదే తమ స్టాండ్ అని మంత్రి తేల్చి చెప్పారు.
నేడు కథనాన్ని ప్రచురించిన సదరు పత్రిక చంద్రబాబు హయంలో 64 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు.