తొమ్మిది ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఅర్ మోసం చేస్తున్నారని, 9 ఎండ్లలో 4.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టాడన్నారు. ఈ రోజు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల…కేసీఅర్ కి 10 ప్రశ్నలను సందించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెచ్చిన అప్పులు అన్ని ఎక్కడ పోయాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు కేసీఅర్ దోచుకున్నాడని వైఎస్ షర్మిల మండిపడ్డారు. మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీ జరిగిందని, తెలంగాణ సొమ్మంతా కేసీఅర్ దోచుకున్నాడని ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో BRS పార్టీ పెట్టాడని, పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసే అంత దోచుకున్నాడన్నారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఅర్ చెప్పాలని, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమయ్యిందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, రుణమాఫీ అని మరో మోసం చేశాడన్నారు. 10 ఎండ్లలో ఉద్ధరించినట్లు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని, ఎందుకోసం ఉత్సవాలు.. ఏం సాధించారని ఉత్సవాలు..చేస్తున్నారని అడిగారు. కేసీఅర్ కి దమ్ముంటే మా 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండని డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా..? ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా అన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఅర్ మోచేతి నీళ్ళు తాగాయని, కేసీఅర్ 9 ఎండ్లుగా ఆడింది ఆట..పాడింది పాటగా సాగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేసీఅర్ కి సప్లయ్ కంపెనీగా మారిందని, బీజేపీ,కాంగ్రెస్ లు నిద్రపోతేనే కదా తెలంగాణ ప్రజల పక్షాన పార్టీ పెట్టిందని వైఎస్ షర్మిల వివరించారు. జాతీయ పార్టీలు నిద్రపోతే YSR తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల మీద కొట్లాడిందన్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించింది కేవలం తను మాత్రమేనని, 3850 KM పాదయాత్ర చేసింది పొత్తులకు,విలీనం చేయడానికి కాదన్నారు. ఇంత కష్టం పడింది విలీనం చేయడానికి కాదన్నారు. తాను ఏదైనా పార్టీలో చేరుతాను అంటే వద్దనే వాళ్ళు ఎవరని, కేసీఅర్ దగ్గర చెరుతాను అంటే వద్దనడు కదా అన్నారు. విలీనం అని అవమాన పరుస్తున్నారని, విలీనం అని చెప్పి తాను పడిన కష్టాన్ని తక్కువ చేయడం సరి కాదన్నారు. విలీనం అని చెప్పి ఒక మహిళను అవమానించకండని విజ్ఞప్తి చేశారు. YSR తెలంగాణ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని నియోజక వర్గాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దింపుతుందని, మేము అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నామని చెప్పారు. పొత్తులు అనేది రేపటి అంశమని, కానీ ఈ రోజు పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఅర్ కి ఓటు వేసినట్లేనని, అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని వైఎస్ షర్మిల అడిగారు. కేసీఅర్ కి కాంగ్రెస్ మళ్ళీ సప్లయింగ్ కంపెనీగా మారదు అనే గ్యారెంటీ ఎంటి..?ఈసారి కేసీఅర్ కి 30 సీట్లు కన్నా తక్కువ రావు..అప్పుడు కాంగ్రెస్ పార్టీ సప్లయింగ్ కంపెనీగా మారదని గ్యారెంటీ ఎంటి..? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కేసీఅర్ కి వ్యతిరేకం అని క్లారిటీ ఇవ్వాలని, అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తామని తెగేసి చెప్పారు. అమరవీరుల సాక్షిగా చెప్తున్నాం..కేసీఅర్ తో పొత్తు అనేది ఎప్పటికీ ఉండదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.