Wednesday, March 11, 2026
HomeTrending NewsBJP: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - అమిత్ షా

BJP: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే – అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్నారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తాయన్నారు.

భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ.. ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని విమర్శించారు.

కేసీఆర్… గుర్తు పెట్టుకోండి.. ఇక మీరు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని అమీత్ షా ఎద్దేవా చేశారు. త్వరలోనే బీజేపీ ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు మనకు కావాలా? అని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచనకు పోరాడిన సమరయోధులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయని.. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ కుటుంబ పార్టీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోడీజీ పార్టీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మోడీ సర్కారు 9 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అమిత్ షా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular