రాష్ట్రంలో జనసేన పార్టీని అధికారంలో తీసుకు వచ్చే వ్యూహం తనకు వదిలేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని, దానికి కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ‘మీరు ఓడిపోతున్నారు, మళ్ళీ అధికారంలోకి రావడంలేదు’ అంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన వాహనం ‘వారాహి’ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రోడ్లపై తిరుగుతానని, ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ చేశారు. ‘మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదలను రమ్మను.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనెంతో చూపిస్తా’ అని ఘాటుగా విమర్శించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చోప్పిన సాయాని చెక్కుల ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ అధికారం చూడని కులాలను అధికారంలో కూర్చోబెట్టడమే జనసేన లక్ష్యమన్నారు. యువతలోనుంచి కొత్త నాయకత్వం రావాలని, వైసీపీ నేతలు ఎన్నికల కోసం ఆలోచిస్తుంటే, తాను రాబోయే రెండు తరాలకోసం ఆలోచిస్తున్నానని చెప్పారు. ఉన్నత కులాల్లో కూడా ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారని, వారుకూడా ఈబీసీ రిజర్వేషన్స్ ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. తనకు ఎవరి మీదా ప్రేమ, ద్వేషం ఏవీ ఉండవని, కానీ ప్రజలకోసం మంచి చేయాలని మాత్రమే అడుగుతానని, అది జరగకపోతే నిలదీస్తానని హెచ్చరించారు.
తాను అనుకుంటే సిఎం కాలేనని, ప్రజలు కోరుకుంటేనే అవుతానని, భుజం కాసేవాడినే కానీ నన్ను మోయమని అడిగేవాడిని కాదన్నారు. అధికార పీఠం జనసేన కు ఇస్తే లక్షల కోట్ల రూపాయలు సమర్ధవంతంగా ఖర్చు చేసి, అవినీతి రహిత పాలన అందిస్తానని, ఒకవేళ తాను ప్రజలకోసం పని చేయకపోతే నిలదీయాలని సూచించారు. ఈ రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలన్నదే మన ముందున్న లక్ష్యమని, అందుకే వ్యూహం సంగతి తనకు వదిలిపెట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రజలకు తప్ప ఎవరికీ కొమ్ము కాయబోనని అన్నారు. మార్పు కావాలంటే పోరాటం చేయాల్సిందేనని, అధికార పార్టీ కేసులు పెడుతుందని.. అన్నిటికీ సిద్ధంగా ఉండాలని కోరారు.