Friday, October 18, 2024
HomeTrending Newsచంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు... విశ్లేషణ

చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు… విశ్లేషణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమితో చెందితే వయసు రిత్యా బాబు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ తర్వాత ఎన్నికల వరకు రాజు ఎవరో.. రెడ్డి ఎవరో.. చెప్పలేని రాజకీయ పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో నెలకొన్నాయి. దీంతో రాష్ట్రంలో సైకిల్ ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా మంత్రాంగం నడిపిస్తున్నారు.

2014లో బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బిజెపి దూరం కావటం… 2019 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు కంగుతిన్నారు. జాతీయ స్థాయిలో యుపిఏ అధికారంలోకి వస్తుందని బిజెపితో విభేదాలు కొనితెచ్చుకొని ఎడం పాటించారు. అనూహ్యంగా బిజెపి రెండోసారి ఢిల్లీ గద్దె ఎక్కటం చంద్రబాబుకు మింగుడు పడలేదు. దీంతో విపక్షంలో కొనసాగుతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు.

తాజాగా టిడిపితో పొత్తుకు బిజెపి ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్కిల్ కుంభకోణంలో బాబు అరెస్టు, బెయిల్ వ్యవహారంలో తెరవెనుక నడిపింది బిజెపి అని ఢిల్లీ వర్గాల వాదన. దీనికి అనుగుణంగా ఎన్నికలు దగ్గర పడ్డాక  రెండు పార్టీల పొత్తు ముందుకు తీసుకువచ్చే విధంగా స్కెచ్ వేశారని వినికిడి. అయితే బాబు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమని…అంతా కేంద్రం ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిందని టిడిపి అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. సైకిల్-కమలం దోస్తీని ఎంతవరకు స్వాగతిస్తారో చూడాలి.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం తర్వాత చంద్రబాబుకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఏపిలోను ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉన్నాయని, తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని భరోసాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని జనసేనతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ను లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు మైకంలో ఉన్నారు. పార్టీలో పొత్తు వ్యతిరేకించే వారు తమ దారి చూసుకోవచ్చని ఖరాఖండీగా అంటున్న జనసేనాని వైఖరితో నేతలు ఆందోళన చెందుతున్నారు.

బిజెపితో విడిపోయామని చెప్పని పవన్ కళ్యాణ్.. టిడిపితోనే వచ్చే ఎన్నికలకు వెళతామని తెగేసి చెపుతున్నారు. జనసేన అంశంలో విజయం సాధించిన చంద్రబాబు.. బిజెపితో చాకచక్యంగా విషయం చక్కబెడుతున్నారు. పొత్తు ఉభయతారకంగా ఉంటుందని, బిజెపికి ఎంపి సీట్లు ముఖ్యం కనుక శాసనసభ స్థానాలపై పట్టు పట్టకపోవచ్చని సమాచారం.

మరోవైపు YS షర్మిలకు ఏపి కాంగ్రెస్ సారథ్యం అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర నేతల్లో ఒకరిద్దరు మాజీ ఎంపీలు తప్పితే అందరు షర్మిల నాయకత్వానికి ఒకే చెప్పారు. త్వరలోనే షర్మిలకు పగ్గాలు అప్పగించే పని పూర్తవుతుందని ఏపిసిసి నేతలు అంటున్నారు.

షర్మిల కాంగ్రెస్లో చేరిక సమయం నుంచే చంద్రబాబు అలెర్ట్ అయ్యారని సమాచారం. షర్మిలతో తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతుందని తన శిష్యుడు ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అభ్యంతరం చెప్పారు. ఇదే అదునుగా షర్మిలను ఏపికి తీసుకువస్తే వైసిపిని ఇరుకున పెట్టవచ్చని, అప్పటి నుంచే తనకున్న మార్గాల ద్వారా బాబు లాబీయింగ్ చేశారని తెలిసింది. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో డీకే శివకుమార్ తో కొద్దిసేపు జరిగిన భేటీలో చర్చించినట్టు తెలుగు తమ్ముల్లే అంటున్నారు.

రాష్ట్రంలో కలిసి పోటీ చేయకపోయినా కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం సిబిఎన్ కు ఉంది అందులో అనుమానంలేదు. సిఎం జగన్ పార్టీని ఇబ్బంది పెట్టగలిగిన స్థానాల్లో కాంగ్రెస్ ను రంగంలోకి దింపటం, లేదంటే బిజెపి, జనసేన పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇలా జాతీయ స్థాయిలో రెండు పార్టీలతో వ్యవహారం చేయటం..సిబిఎన్ రాజకీయ చాతుర్యం చివరకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

బిజెపి ప్రస్తావన తీసుకువస్తే అగ్గి మీద గుగ్గిలం అయ్యే కాంగ్రెస్ నేతలు బాబు రెండు పడవల ప్రయాణాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అనుమానమే. బాబు మరోసారి తప్పటడుగు వేస్తున్నారని, మూడు పార్టీలతో వ్యూహం ప్రమాదకరమని, బెడిసి కొడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు నైజం…మూడు పార్టీలతో వ్యవహారం ప్రజల్లోకి వెళితే ఒక్కసారిగా రివర్స్ అవ్వటం ఖాయమని అంటున్నారు. చివరకు చంద్రబాబు రాజనీతి జగన్ కు ప్లస్ అవుతుందని విశ్లేషణ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్