Sunday, September 8, 2024
HomeTrending NewsBJP Andhra Pradesh: వలస నేతలకే ఎంపి సీట్లు!

BJP Andhra Pradesh: వలస నేతలకే ఎంపి సీట్లు!

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైంది.  గత ఎన్నికల్లో రాష్ట్రంలో  ఒంటరిగా పోటీ చేసి కుదేలైంది. దేశం మొత్తం మోడీ హవా కొనసాగినా ఏపీలో మాత్రం ఒక్క అసెంబ్లీ, లోక్ సభ సీటు కూడా గెల్చుకోలేకేపోయింది, పైగా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. గతంలో మోడీతో విభేదించి ఎన్డీయేకు దూరమై భారీ ఓటమి చవిచూసిన చంద్రబాబు అనివార్య పరిస్థితుల్లో బిజెపి శరణుజొచ్చారు. బిజెపి కేంద్ర పెద్దలకు బాబుతో పొత్తు ఇష్టం లేకపోయినా….  సిఎం జగన్ పై వ్యక్తిగత కక్ష ఉన్నట్లు వ్యవహరించే జనసేనాని పవన్ కళ్యాణ్…టిడిపి-బిజెపి-జనసేన కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి ఎట్టకేలకు సఫలీకృతం అయ్యారు. 2019 ఎన్నికలు కాగానే టిడిపి వదిలి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, సిఎం రమేష్ లాంటి నేతలు కూడా తమవంతు పాత్ర పోషించారు.

పొత్తులో భాగంగా 6 ఎంపి, 10 ఎమ్మెల్యే సీట్లకు బిజెపి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ లోక్ సభ సీట్లలో మాత్రం మోడీ, రామమందిరం అంశాలు ప్రభావితం చేసి విజయం ఖాయమన్న ధీమా ఆ పార్టీ నేతల్లో ఉంది. అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. లోక్ సభ సీట్లు ఆరింటిలో… ఇప్పటివరకూ ఉన్న సమాచారం బట్టి విజయనగరం- పీవీఎన్ మాధవ్; అరకు-కొత్తపల్లి గీత, అనకాపల్లి-సిఎం రమేష్; నర్సాపురం- రఘురామ కృష్ణం రాజు; రాజమండ్రి- దగ్గుబాటి పురందేశ్వరి; రాజంపేట-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. వీరందరిలో కేవలం ఒక్క సీటులోమాత్రమే తరాలుగా బిజెపిలో కొనసాగుతున్న పీవీఎన్ మాధవ్ ఉన్నారు. మిగిలిన వారంతా వలస నేతలే… హిందూపురం నుంచి బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆ సీటుకు బీకే పార్థసారథిని  తమ అభ్యర్ధిగా తెలుగుదేశం ప్రకటించింది. హిందూపురంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నందున లోక్ సభ సీటు బిజెపికి ఇస్తే ఆ ప్రభావం అసెంబ్లీపై పడి నందమూరి బాలకృష్ణకు ఇబ్బంది అవుతుందని… అందుకే ఈ సీటులో టిడిపి పోటీ చేసేలా బాబు ఒత్తిడి తీసుకురాగా, దానికి పురందేశ్వరి కూడా శృతి కలిపారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పరిపూర్ణానంద ఆగ్రహంతో ఉన్నారట.

ఒకవేళ తిరుపతి సీటుపై బిజెపి పట్టుబడితే విజయనగరం టిడిపి పోటీ చేసే అవకాశముంది. ఇదే జరిగితే మాధవ్ కు కూడా అవకాశం లేనట్లే.

మరోవైపు  దశాబ్దాలుగా బిజెపిలోనే కొనసాగుతూ సంఘ్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు, భాను ప్రకాష్ రెడ్డి, సత్య కుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి నేతలకు ఈ ఎన్నికల్లో కూడా నిరాశ తప్పడంలేదు.

ఏప్రిల్ మొదటి వారంలో రిటైర్ కాబోతోన్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తొలుత విజయవాడ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు సాగించేవారు. వైజాగ్ సీటుపై జాతీయ నాయకత్వం హామీ ఇవ్వడంతో రెండేళ్ళ క్రితమే అక్కడకు మకాం మార్చి పని చేసుకుంటున్నారు. అయితే బాలయ్య చిన్నల్లుడు భరత్ కోసం ఆ సీటును టిడిపి  పట్టుబట్టి తీసుకుంది. అనకాపల్లి నుంచైనా జీవీఎల్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నా సిఎం రమేష్ ఆ సీటుపై కన్నేశారు. పొత్తు కుదర్చడంలో తెరవెనుక ప్రయత్నాలు చేసిన సిఎం రమేష్ కోసం అనకాపల్లి…. రఘురామకృష్ణంరాజు  కోసం నర్సాపూర్ తీసుకోవడంతో జీవీఎల్, సోము లాంటి నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు అసెంబ్లీ సీట్లలో కూడా అలాంటి దుస్థితి ఎదురవుతోంది. విష్ణు కుమార్ రాజు ఒక్కరే గత ఐదేళ్లుగా కొద్దో గొప్పో క్రియాశీలకంగా ఉన్నారు. కామినేని శ్రీనివాస్ కేవలం ఎన్నికల సమయంలోనే కైకలూరు వస్తారు, మిగిలిన సమయం మొత్తం వెంకయ్యనాయుడు సేవలోనే ఉంటారు. మరోసారి ఆయన కైకలూరు నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. బిజెపిలో ఎప్పటినుంచో కొనసాగుతున్న నేతలను అసెంబ్లీ స్థానాలకు పోటీలో దించినా పెద్దగా ఉపయోగం ఉండదు.

బిజెపి నేతలు పలువురు ఈ అంశాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్ళారు కానీ ఎలాంటి ఫలితం ఇప్పటిదాకా లేదు. వలస నేతలకే ప్రాధాన్యం ఇవ్వడం, బిజెపి తాము కోరుకున్న స్థానాలకు బదులు టిడిపి కేటాయించే స్థానాల్లోనే పోటీకి దిగుతుండడం మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి విజయావకాశాలను  దెబ్బతీసే అవకాశం కచ్చితంగా ఉంది. దీనిపై బిజెపి అగ్రనేతలు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్