Botsa Review:
ఫోటోలకు ఫోజులిస్తూ, జూమ్ మీటింగ్ లు పెట్టుకొని షో చేయాల్సిన అవసరం సిఎం జగన్ కు లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వరదలపై సిఎం ప్రతి అరగంటకూ సమీక్ష చేస్తున్నారని చెప్పారు. ఎవరో ఒకరు కామెంట్ చేశారని దానిపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు అనంతపురం జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో వరద సహాయక చర్యలు సమీక్షించేందుకు బొత్స అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు.
సిఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకొని మంత్రులను, ఎమ్మెల్యేలను అలెర్ట్ చేస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి స్వయంగా సమస్యలు తెలుసుకుంటున్నారని, చంద్రబాబు మాదిరిగా గాలి కబుర్లు చెబుతూ జిమ్మిక్కులు చేస్తూ ప్రజలని మభ్య పెట్టాల్సిన అవసరం జగన్ లేదని బొత్స వ్యాఖ్యానించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి కావడం, సహాయక చర్యలు సమర్ధవంతంగా నిర్వహించడంపై మాత్రమే సిఎం జగన్ ఆలోచిస్తారని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్ లో బొత్స సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి శంకర నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read : బాబు సంస్కారానికి నా నమస్కారం : సిఎం