4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమాట మకరందం .. పాట సుమగంధం

మాట మకరందం .. పాట సుమగంధం

ఆత్రేయ .. అక్షరాలు మురిసిపోయే పేరు .. పదాలు పరవశించిపోయే పేరు. తెలుగు సినిమా ‘మాట’కి మకరందం అద్దిన మనసు కవి ఆయన. తెలుగు సినిమా పాటకు సొగసులు దిద్దిన మన సుకవి ఆయన. రాసిన ప్రతిమాట మనసు లోతులను తాకుతూ వెళుతుంది.

ప్రతి పాట పరిమళాల ప్రవాహమై హృదయాంతరాలను చేరుతుంది. బరువైన భావాలను తేలికైన పదాలతో చెప్పడం ఆత్రేయ ప్రత్యేకత. తెలుగులో చేయి తిరిగిన మాటల రచయితలు .. పదాలతో విన్యాసాలు చేయించే పాటల రచయితలు చాలామందే ఉన్నారు. ఇటు మాటలను .. అటు పాటలను సమ ఉజ్జీగా పరిగెత్తించినవారిలో ఆత్రేయ ముందువరుసలో కనిపిస్తారు.

ఆత్రేయ అసలు పేరు కిళామ్బి వేంకట నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లా .. సూళ్లూరు పేట పరిధిలోని ‘మంగళంపాడు’లో మే 7వ తేదీ 1921లో ఆయన జన్మించారు. తన పేరు పొడవుగా ఉందని భావించిన ఆయన, గోత్రమైన ‘ఆత్రేయ’నే అసలు పేరుగా మార్చేసుకున్నారు .. అలా పిలిపించుకోవడానికే ఇష్టపడ్డారు. చిత్తూరులో .. నెల్లూరులో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. సినిమాల్లోకి రావడానికి ముందే ఆయన నాటకాలు .. నాటికలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. 1951లో ‘దీక్ష’ సినిమాలో ‘పోరా బాబూ పో.. ‘ అనే పాటతో పాటల రచయితగా ఆయన ప్రయాణం మొదలైంది.

‘తోడికోడళ్లు’ సినిమాలో ‘కారులో షికారు కెళ్లే ‘ పాట .. ఆత్రేయను గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ‘పెళ్లికానుక’ సినిమాలోని ‘వాడుక మరిచెదవేలా’ పాట నుంచి ఆత్రేయ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ‘శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం’ లో ‘శేషశైలావాసా శ్రీవేంకటేశ ..’ తదితర పాటలు, ఆత్రేయ ప్రేమ గీతాలు మాత్రమే కాదు .. భక్తిపాటలు కూడా రాయగలరు అని నిరూపించాయి. ప్ర్రేమ … విరహం .. వియోగం .. ఆనందం … ఆవేదన .. ఇలా లాలి పాటలు మొదలు ఆత్రేయ వందలాది పాటలు రాశారు. ఇప్పటికీ ఆ పాటలు ప్రతి నరంలో .. ప్రతి స్వరంలో ప్రవహిస్తూనే ఉన్నాయి.

ఆత్రేయ పాటలే కాదు ఆయన మాటల్లోను పదును కనిపిస్తుంది. వేదాంత ధోరణిని .. తత్త్వసారాన్ని తేలికైన పదాలతో అందించడం .. సామాన్యులకు అర్థమయ్యేలా ఆవిష్కరించడం ఆయనకే సాధ్యమైంది. ఆత్రేయ రాసిన మాటలనైనా  పాటలనైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. ద్రాక్షరసం తీసినంత తేలికగా అవి  అర్థమైపోతాయంతే. ఆత్రేయ అర్ధరాత్రి దాటిన తరువాత తన కలాన్ని నూరేవారు. తాను రాయడానికి అదే సరైన సమయమని చెప్పేవారు. అర్ధరాత్రివేళ రాస్తారు గనుకనే, ఆయనను ‘అర్థరాత్రేయ’ అని సరదాగా చెప్పుకునేవారట.

రచయితలు .. దర్శక నిర్మాతలుగా ఇప్పుడు మారుతున్నారని అనుకుంటాముగానీ, అప్పట్లోనే ఆత్రేయ దర్శక నిర్మాతగా ‘వాగ్దానం’ సినిమాను తెరకెక్కించారు. మాటల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేసిందో తెలిసిందే. ఆత్రేయ సమయానికి రాయక పోవడం .. ఏవిషయాన్నైనా అంత సీరియస్ గా తీసుకోకపోవడం వలన ఆయనకి  అవకాశాలు తగ్గుతూ వచ్చాయని అంటారు. ఇక తనని ఎవరు ఏమన్నా ఆయన పట్టించుకోకపోవడం .. తనపై జోక్ చేసినా సరదాగా నవ్వేసుకోవడం ఆయన గొప్పతనమని చెబుతారు.

జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు .. ఈ విషయం అన్ని పాటలు రాసిన ఆత్రేయకు తెలియదనుకోవడం అమాయకత్వం. చిత్రపరిశ్రమలో ఎవరి వైభవం ఎక్కువ కాలం నిలవదని తెలిసి కూడా ఆయన ముందుచూపుతో జాగ్రత్త పడలేదు. ఫలితంగా చివరిదశలో ఆర్ధికంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ‘ప్ర్రేమ’ సినిమాలో లవ్ సీన్స్ వరకూ రాసే అవకాశం తనకి ఇవ్వమనీ .. తన పేరు వేయవలసిన అవసరం లేదనీ .. డబ్బులు ఇస్తే చాలని పరుచూరి బ్రదర్స్ ను ఆత్రేయ రిక్వెస్ట్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఆత్రేయకి అప్పట్లో అవకాశాలు తగ్గి ఉండవచ్చు .. కానీ ఆయన పేరుకు ఎప్పటికీ గౌరవం తగ్గదు. ఆత్రేయ అప్పట్లో పేదరికాన్ని అనుభవించవచ్చు .. కానీ ఆయన రాసిన పదాలకు సరైన విలువకడితే ఆయనను మించిన మహారాజు లేరు.ఆత్రేయకు సంపాదన విషయంలో ముందుచూపు లేకపోవచ్చును .. కానీ ఆయన భావాల సంపదలు .. అనుభవాల నిధులు అనంతాలు. తెలుగు సినిమా సాహిత్యంలో ఆయన రాసిన ప్రతి మాటా ఒక ఆణిముత్యమే .. ప్ర్రతి పాటా ఒక జాతి రత్నమే. పాడుతా తీయగా హాయిగా అంటూ ఆ పాటలన్నీ పాడుకోవచ్చు .. గుండె గనుల్లోని  అనుభూతులు చేదుకుని ఆవేదనను చల్లబరుచుకోవచ్చు. మనసు కవికి మరణం లేదు .. ప్రతి మనసూ ఆయన నివాసమే .. ప్రతి అంతరంగం ఆయన ఆవాసమే!

–  పెద్దింటి గోపీకృష్ణ

(ఆత్రేయ శత జయంతి ప్రత్యేకం)

RELATED ARTICLES

Most Popular

న్యూస్