Friday, September 20, 2024
HomeTrending NewsTelangana: తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు

Telangana: తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను.. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. ఈమేరకు ఈ రోజు 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. సోమవారం 9లక్షల2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ఇచ్చారు. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు.

రైతుల రుణమాఫీ గురించి ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ప్రకటన చేశారు. మరుక్షణం నుంచే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు సీఎం ఆదేశాలకు అనుగుణంగా 45 రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రోజువారీగా సమీక్షలు చేస్తూ బ్యాంకులతో మాట్లాడుతూ రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 3వ తేదీన 41వేల లోపు రుణాలున్న 62వేల 758 మంది రైతులకు సంబంధించి 237 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేశారు. అలాగే, ఆగస్టు 4వ తేదీన 43వేల లోపు రుణాలున్న 31వేల 339 మంది రైతులకు సంబంధించి 126 కోట్ల 50 లక్షల రుణాలను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తర్వాత తాజాగా 99వేల 999 రూపాయల వరకు ఉన్న రుణ మొత్తాలను జమ చేస్తున్నది. 99వేల 999 రూపాయల వరకు అప్పున్న రైతుల సంఖ్య 9లక్షల 2 వేల843 ఉన్నది. వీరికి సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనున్నది. దీంతో 16 లక్షల 66వేల 899 మంది రైతులకు రూ.7753 కోట్ల 43లక్షల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్