Target AP: నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయంతో ఈ హోళీ తమకు ఎంతో ప్రత్యేకమైనదని బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీ కార్యకర్తల్లో ఈ ఫలితాలు ఓ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బిజెపి జెండా ఎగురవేస్తామన్నారు.
నిన్న గెలిచాం యూపీ- రేపు గెలుస్తాం ఏపీ’ అంటూ జీవీఎల్ నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్టాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిపై గత టిడిపి ప్రభుత్వానికి కాస్త లేటుగా అసహనం వస్తే, వైసీపీ ప్రభుత్వానికి త్వరగా ఏర్పడిందన్నారు.
రేపు కడపలో నిర్వహించనున్న ‘రాయలసీమ రణభేరి’లో, సీమ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ఏమిటో వెల్లడిస్తామని, దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీమ ప్రాజెక్టులను ఎలా నిర్లక్ష్యం చేశాయో ప్రజలకు వివరిస్తామన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి బిజేపితోనే సాధ్యమనే విషయాన్ని స్పష్టంగా చెబుతామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోము వీర్రాజు నేత్రుత్వంలో బిజెపి రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని వివరించారు.