దసరా నవరాత్రులలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం రోజుకు 30 వేల మందికి పరిమితం చేయాలని దుర్గ గుడి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మూలా నక్షత్రం రోజున మాత్రం 70 వేల మందికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో దసరా ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ మాధవి లత, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తదితరులు హాజరయ్యారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.
కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, ఈ పరిస్థితిలో దర్శనాలను పరిమిత సంఖ్యలోనే అనుమతించాలని సమావేశం అభిప్రాయపడింది. అమ్మవారి దర్శనానికి ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరి చేయాలని కమిటీ తీర్మానించింది. కొండ కింద ఆన్ లైన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 7 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది.
అక్టోబర్ 7 నుంచి 15 వరకూ దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా, అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున అంటే అక్టోబర్ 12 ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.