ఇండిగో కావాలనే ప్రయాణికులను ఇబ్బంది పెడుతోందా? పౌర విమానయాన శాఖ కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కొన్నిరోజులుగా తీవ్ర నిర్వహణాపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వందలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పైలట్లకు కొత్త డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు అమలు కావడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని ఇండిగో చెబుతున్నప్పటికీ, ఎయిర్ లైన్స్ కావాలనే ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంక్షోభానికి కారణం FDTL నిబంధనలు:-
పైలట్ల అలసటను నివారించి, భద్రతను పెంచే లక్ష్యంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలను నవంబర్ 1 నుండి కఠినంగా అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం పైలట్ల వీక్లీ రెస్ట్ పీరియడ్ 12 గంటల నుండి 48 గంటలకు పెరిగింది. అలాగే, రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యపై కూడా పరిమితులు విధించారు.
ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సిబ్బంది షెడ్యూల్స్ ను మార్చుకోవడంలో ఇండిగో విఫలమైంది. వాస్తవానికి, ఈ నిబంధనలను అమలు చేయడానికి ఎయిర్‌లైన్స్‌కు రెండేళ్ల సమయం ఉన్నా, ఇండిగో సరైన ప్రణాళికతో సిబ్బందిని నియమించుకోలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ఆరోపించింది. దీంతో కొత్త రూల్స్ అమలయ్యాక ఒక్కసారిగా సిబ్బంది కొరత ఏర్పడింది.

ఇండిగో కావాలనే సమస్య సృష్టిస్తోందా?
ఇండిగో సంక్షోభంపై స్పందించిన కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ- ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైలట్ల కొరతను సాకుగా చూపి, కావాలనే ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసేలా ఇండిగో ప్రవర్తించిందనే విమర్శలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో, DGCA ఇండిగోకు నోటీసులు జారీ చేసింది.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో, డీజీసీఏ తాత్కాలికంగా కొన్ని FDTL నిబంధనలను ఒక వారం పాటు సడలించింది. ఈ నిర్ణయం ఇండిగోకు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, ఈ మొత్తం వ్యవహారం ఇండిగో నిర్వహణ లోపాలను, ప్రయాణికులపట్ల నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త పౌర విమానయాన నిబంధనలు, ప్రయాణికుల హక్కులు:-
ఈ సంక్షోభం తర్వాత, ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు డి జి సి ఏ కఠిన చర్యలు తీసుకుంటోంది.
- రీఫండ్, పరిహారం:- విమానం రద్దయినా లేదా ఆలస్యమైనా ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను, అవసరమైతే హోటల్ వసతిని ఎయిర్‌లైన్స్ అందించాల్సి ఉంటుంది.
- 48 గంటల ‘లుక్-ఇన్’ ఆప్షన్:- టికెట్ బుక్ చేసిన 48 గంటలలోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా టిక్కెట్‌ను రద్దు చేసుకోవడానికి లేదా మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని DGCA కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.
- కఠిన పర్యవేక్షణ:- ఇండిగో సంక్షోభం నేపథ్యంలో, అన్ని ఎయిర్‌లైన్స్ తమ సిబ్బంది నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారో లేదో అని డి జి సి ఏ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తుండడంతో భవిష్యత్తులో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు భంగం కలిగించే ఎయిర్‌లైన్స్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
భారత విమానయాన వ్యాపారంలో ఇండిగో వాటా 65 శాతం. రోజుకు నాలుగు లక్షలమంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఆ గుత్తాధిపత్యంతో ఇండిగో దేశప్రజలతో, కేంద్రప్రభుత్వంతో ఒక ఆట ఆడుకుంటోంది. ఆఫ్టర్ ఆల్ ఒక విమానాలు నడిపే ప్రయివేటు సంస్థ ఒత్తిళ్ళకు, బెదిరింపులకు భయపడి పౌర విమానయాన శాఖ తాత్కాలికంగా అయినా భద్రతా నిబంధనలు పాటించడంలో ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడాన్ని దేశప్రజలు అంగీకరించడం లేదు. అహ్మదాబాద్ లో గాల్లోకి ఎగిరిన విమానం నేలకొరిగిన విషాదంలో పైలట్ ఏ మీట నొక్కాలో తెలియక ఏదో మీట నొక్కడం వల్లే జరిగిందని ఇప్పటికీ విషాదగీతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రయివేటు కార్పొరేట్ పర్వతాలను ఏ మీట నొక్కి అదుపులో ఉంచాలో తెలియని రోజులొచ్చాయి.

దీన్ని ఇండిగో గుత్తాధిపత్యం సాధించిన విజయంగా చూడాలా?
సర్వతంత్ర స్వతంత్ర గణతంత్ర ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రయాణికుల భద్రతాప్రమాణాలను గాలికొదిలేసిన బేలతనంగా చూడాలా?
మేరుపర్వతాలుగా ఎదిగిన ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే ఎత్తుగడగా చూడాలా?
రేప్పొద్దున ఇదే నీచమైన ఎత్తుగడ మిగతా రంగాల్లో ప్రయివేటు సంస్థలకు ఆదర్శమైతే?
…జరగరానిది జరిగితే…పొట్టి ట్విట్టర్ లో ఇండిగో సి ఈ ఓ చెప్పినట్లే “Sorry” అన్న ఒక్క మాట చెబితే సరిపోతుంది- బారా ఖూన్ మాఫ్!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

