Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Plane-Language: మానం, విమానం పదాల మధ్య శబ్ద సారూప్యం తప్ప…ఇక ఏ రకమయిన సంబంధం లేదని భాషాశాస్త్రవేత్తలు అనుకోవడానికి వీల్లేకుండా…విమానాలు మన మానం తీసి అర్థ సారూప్యాన్ని సాధిస్తూ ఉంటాయి.

విమానాశ్రయానికి వెళుతున్న ప్రతిసారీ నా మానం నిరాశ్రయ అయి గుండెల్లో గుచ్చుకున్నట్లు ఉంటుంది.

⦿ నేను నేనేనని, నా పుట్టుమచ్చలు నావేనని, ఆధార్ కార్డు ఆధారంగా సాయుధులకు చూపితే తప్ప లోపలికి పోనివ్వనప్పుడే సగం మానం పోతుంది.

⦿ నా పెట్టెలో ఆర్ డి ఎక్స్, నాటు బాంబులు, వేట కొడవళ్లు, కంట్రీ మేడ్ పిస్తోళ్లు, గంజాయి లేవని స్కానర్ పరీక్ష చేస్తున్నప్పుడు మరో పాతిక భాగం మానం ఆవిరవుతుంది.

⦿ సెక్యూరిటీ చెక్ కు ముందు నడుము బెల్ట్ విప్పి, చేతులు పైకెత్తగా ప్యాంటు జారినప్పుడు మిగిలిన పాతిక భాగం మానం కూడా హారతి కర్పూరంలా కరిగిపోతుంది.

⦿ అయినా…అవసరం మనది కాబట్టి గుండె రాయి చేసుకుని...విమానయాన సందర్భంలో మానావమానాలు శరీరానికే కానీ…ఆత్మకు కాదనుకుని…మెట్ట వేదాంతమేదో గుర్తుకు తెచ్చుకుని…విమానంలోకి దూరంగానే…మన మాతృభాష తెలుగుకు జరిగే అవమానంతో కడుపులో తిప్పినట్లవుతుంది.

⦿ కూర్చుని నడుము బెల్ట్ బిగించుకోగానే…సభీ యాత్రికోంకో స్వాగత్ హై…లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్ కమ్ ఆన్ బోర్డ్ …మై కల్పన…ముఖ్య్ విమానిక్ వికల్పన…పరిచారిక్ పరికల్పన…సహాయక్ నిస్సహాయ…ఆప్ కీ సేవాకే లియే హమ్ అంగ్రేజీ, హిందీ ఔర్ మరాఠీమే బాత్ కర్నేవాలే హై…అనగానే…హై స్కూల్లో మా హిందీ సార్ చెప్పిన హై…హు…హో…భూత భవిష్యత్ వర్తమాన లింగ వచన విభక్తి ప్రత్యయాలన్నీ లీలగా గుర్తొస్తాయి కానీ…ఆలోపు వారు రోబో వేగంతో ఇంగ్లీషులోకి దూకుతారు.

⦿ హైదరాబద్ నుండి విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి వెళ్లే విమానాల్లో అంగ్రేజీ, హిందీ ఔర్ మరాఠీ, గుజరాతీ, పైశాచి, అవధి, టింబక్తు ఔచిత్యమేమిటో అర్థమై చావదు.

⦿ ఈ రోజుల్లో ఆటోమేటెడ్ ట్రాన్స్లేషన్ సాఫ్ట్ వేర్లు లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా కొంతలో కొంత ప్రాంతీయ భాషలో చెప్పవచ్చు. ఎంత యాంత్రికంగా ఉన్నా…స్థానిక భాషలో చెబితే కనీసం విషయం రైల్వే ప్లాట్ ఫామ్ అనౌన్స్ మెంట్ లా అయినా అర్థమవుతుంది కదా? వారు గొప్పగా చెప్పుకునే అంగ్రేజీ హిందీ ఔర్ కాశ్మీరీ కూడా పరమ యాంత్రికంగానే ఉంటుంది.

విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే ఒకానొక ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర సీటు వచ్చిన ఒక తెలుగు మహిళకు హిందీ/ఇంగ్లీషు రాదన్న కారణంతో ఆమెను కూర్చున్న సీటు నుండి లేపి బలవంతంగా ఇంకెక్కడో కూర్చోబెట్టారు. ఇది అత్యంత అవమానకరమని ఆమె పక్క సీటులో కూర్చున్న ఐ ఐ ఎం అహ్మదాబాద్ అధ్యాపకురాలు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ మంత్రి కె టి ఆర్ నిరసన వ్యక్తం చేశారు. విమానం ప్రయాణించే రూట్లో ఎక్కే దిగే ప్రాంతాల భాషను విమాన సిబ్బంది మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లేదంటే విమాన సంస్థలు ఇలా అధికారికంగా ప్రకటించుకోవచ్చు.

⦿ మీకు అంగ్రేజీ, హిందీ రాదా? అయితే విమానం ఎక్కి మానం పోగొట్టుకోకండి.

⦿ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర సీటు అంగ్రేజీ, హిందీ వచ్చినవారికే పరిమితం.

⦿ భాష అవసరమే లేని సైగల మూగ భాష, బధిరుల ప్రత్యేక భాష తెలిసినవారికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర సీటు కేటాయింపులో కొన్ని మినహాయింపులుంటాయి.

⦿ వీపు విమానం మోత మోగించేది, మానం తీసి చేతిలో పెట్టేదే విమానం అని ఆధునిక విమాన శబ్ద వ్యుత్పత్తి అర్థంగా భావించి…విమానంలోకి ప్రవేశించాల్సింగా సభీ యాత్రికోంకో అనిరోధ్ హై.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

ఐసీఎంఆర్ ఇండియా విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com