Saturday, January 18, 2025
HomeTrending Newsకాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ... కాంగ్రెస్ కు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ… కాంగ్రెస్ కు సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలికితీయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ప్రాజెక్టులో నిజాలు నిగ్గు తేలాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం కొత్త ఎటిఎంగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. విచారణకు క్యాబినెట్‌లో తీర్మానించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం అధికారులు జనవరి 9న  ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రాజెక్టు కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను తీసుకెళ్లారు. జలసౌధతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ… నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.

నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది.

కమిటీ నివేదికే తమకు ఆధారమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత మరమ్మ్మతులు చేపడతామని మంత్రి ప్రకటించారు. దీంతో కాళేశ్వరం పరిధిలో నాలుగు నెలలపాటు సాగునీటి కొరత ఏర్పడనుంది.

ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చులు, అప్పులు అధికంగా ఉన్నా అందుకు తగ్గట్లుగా రైతులకు ప్రయోజనం చేకూరలేదనే ఆరోపణలు ఉన్నాయి. తమ ప్రభుత్వం అవసరం మేరకే ఖర్చులు చేస్తుందని, చేసిన ప్రతి రూపాయికి విలువ ఉండేలా పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కొత్త వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాళేశ్వరం వ్యవహారంలో అధికార విపక్షాల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో రెండు పార్టీలకు విరాళాలు ఇచ్చిన కాంట్రాక్టు సంస్థలే సంధి కుదిర్చినట్టు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడిచినట్టు చేయు అన్నట్టుగా అధికార, విపక్షాల తీరు ఉందని విమర్శలు ఉత్పన్నం అవుతున్నాయి. ఓటుకు నోటు కేసు మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ కొండెక్కినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజిలన్సు విచారణ, డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల కమిటీల నివేదికలను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెపుతోంది. కాళేశ్వరం విచారణలో నిజాలు నిగ్గు తేల్చకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితే కాంగ్రెస్ కు ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్