Saturday, January 18, 2025
HomeTrending Newsగాడి తప్పుతోన్న సంక్షేమం

గాడి తప్పుతోన్న సంక్షేమం

రాష్ట్ర అభివృద్ధి పేరుతో వస్తున్న పెట్టుబడులతో సంక్షేమం గాడి తప్పే ప్రమాదముందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నలుగురు మంత్రుల సమావేశాలు, కార్యక్రమాల సరళి విశ్లేషిస్తే ప్రభుత్వ ప్రాదాన్యతల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ నారాయణన్ కృష్ణకుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డెల్టా రాకతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనటంలో సందేహం లేదు.

అదే క్రమంలో అట్లాంటాలోని కోకా-కోలా హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్ తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్ మెంట్ ను ఆహ్వానించారు. గంటన్నర సేపు జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకా-కోలా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

90 లలో హైదరాబాద్ లో తాగునీటి కొరతకు శీతల పానియాల సంస్థలు కారణమని ఆరోపణలు ఉన్నాయి. కోకా కోల, పెప్సీ రెండు సంస్థలు తమ పానియాలలో మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించటం మానుకొని… తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడే సంస్థలను తీసుకురావటం మంచిదని మేధావులు హితవు పలుకుతున్నారు.

మరోవైపు దేశంలో తొలిసారిగా గ్లోబల్ రైస్ సమ్మిట్ -2024 హైదరాబాద్ లో జరిగింది. అంతర్జాతీయ సరకుల ( కమాడిటిస్ ) సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వనిర్వహించిన ఈ సదస్సు జూన్ 7,8 తేదీల్లో జరిగింది. 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతి దారులు,భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే రెండవ స్థానంలో ఉందని, భవిష్యత్ లో మరింత వరి ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అందుకు నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని, రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల మిల్లులు ఉన్నాయని తెలిపారు.

వరి సాగుతో వెలువడే మిథేన్ వాయువు పర్యావరణ హాని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆహారంలో బియ్యం ముఖ్య భూమిక పోషిస్తోంది. దీంతో నేడు జీవన శైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 30 ఏళ్ళకే బిపి, షుగర్ సమస్యలు సాధారణం అయ్యాయి.

రాష్ట్ర రైతాంగాన్ని పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లించకపోగా వరి సాగు ప్రోత్సహించే విధంగా ఉన్న మంత్రుల వ్యాఖ్యలు, ప్రభుత్వ విధానాలపై సమీక్షించాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మంత్రులు కొంత సామాజిక అవగాహనతో వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మంత్రులు… బహుళ జాతి సంస్థల వనరుల దోపిడీ, ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్