Saturday, November 23, 2024
Homeసినిమాబంధాలను హత్తుకోమనే 'ఇరుగు పత్రు’

బంధాలను హత్తుకోమనే ‘ఇరుగు పత్రు’

ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే వారిమధ్య కొట్లాటలు మామూలే. ఈ నలుగురిలో ఒకరు ఆ గొడవలు సర్దుబాటు చేస్తూ ఉంటారు. నాదీ ఇంచుమించు అటువంటి అనుభవమే. అయితే ఈ మధ్యవర్తిత్వం తర్వాతి కాలంలో నా కెరీర్ అవుతుందని అనుకోలేదు. కొన్నేళ్ల జర్నలిజం తర్వాత అనుకోకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్స్ చదివి ఫ్యామిలీ కోర్టు కేసులు మధ్యవర్తిత్వం చేసే అవకాశం వచ్చింది. అయిదారు జంటల్ని కలిపాక ధైర్యం పెరిగింది. అదే నా ‘ హార్ట్ టు హార్ట్’ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మరెంతోమంది భార్యాభర్తల తగాదాలు పరిష్కరించడానికి అవకాశమిచ్చింది. నిజానికి ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది ‘ఇరుగపత్రు’సినిమా. ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా చూస్తుంటే ఎన్నెన్నో అనుభవాలు కళ్ళముందు కదలాడాయి.

ఫ్యామిలీ కోర్టు తరఫున కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ముగ్గురు పిల్లలు, భార్య ఉండగా నిస్సిగ్గుగా వారిని వదిలేసి మరో వివాహానికి సిద్ధపడిన వ్యక్తి, అతను అవకాశమిస్తే కాపురం చెయ్యడానికి సిద్ధమంటూ బతిమాలిన భార్య, బిడ్డల ముఖం చూసి కూడా కరగని కాఠిన్యం చాలారోజులు వెంటాడేది. కుటుంబ విషయాల్లో మధ్యవర్తిత్వం సులభం కాదు. ముఖ్యంగా కోర్టు దాకా వెళ్ళాక భార్యాభర్తల్ని కలపడం చాలా కష్టం. అయితే కుటుంబ సభ్యులు, ఇతర ఒత్తిళ్లకు లొంగి గొడవ పడేవారిలో మార్పు సాధ్యమే. అది కూడా మొదటిదశలో కౌన్సిలింగ్ కి వస్తేనే.

మరో జంటకు పెద్దల ఆమోదంతోనే పెళ్లయింది. వారిద్దరూ అభిరుచులు తెలుసుకోకుండానే తల్లిదండ్రులూ అయ్యారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. భర్త ఉద్యోగం, స్నేహితులు, షికార్లు అంటూ ఆనందంగానే ఉన్నాడు. భార్య జీతంపై పెత్తనం కూడా అతనిదే. కానీ ఆమె కి ఏమి ఇష్టమో తెలీదు. ఏ రోజూ ఇద్దరూ మాట్లాడుకుంది లేదు. ఆమెకి ఆఫీసులో సమస్య ఉంటే ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. ఇంటా బయటా పనితో సతమతమవుతూ ఆమె నవ్వడం మరచిపోయింది. చిన్న విషయాలకే పాపని చితక్కొట్టేది. వారి కుటుంబ స్నేహితులు నా వద్దకు తీసుకొచ్చారు. ఆమె నుంచి మెల్లగా విషయాలు రాబట్టి ఆమె చేతే భర్తకి చెప్పించాను. మొదట తెల్లబోయిన తర్వాత తప్పు గ్రహించాడు. తర్వాత మళ్ళీ రాలేదు కాబట్టి బాగున్నారనే అనుకుందాం.

… ఇలా రకరకాల వ్యక్తులు. అమెరికాలో ఉన్నా అత్తగారి పోరు తప్పడం లేదనే కోడలు, పెళ్ళయాక భార్య మారిపోయిందనే భర్తలు, పుట్టింటి, అత్తింటి జోక్యాలతో విడాకులకు సిద్ధపడే జంటలు ఎందరో! వీరు కొద్దిగా మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ ఆ అవసరం గుర్తించకపోతేనే గొడవలు. మూడే జంటల సమస్యతో రూపొందిన ఇరుగపత్రు సినిమాలో చాలా చక్కగా కారణాలు విశ్లేషించారు. ఈ సినిమాలో చూపినట్టు కాకున్నా మధ్యవర్తిత్వం చేసేవారికి మానసిక దృఢత్వం అవసరం. లేకుంటే నిద్రలో కూడా సమస్యలు వెంటాడతాయి. మొత్తమ్మీద నేటి సమాజంలో భార్యాభర్తల పోకడలను నిశితంగా విశ్లేషించిన ఇరుగపత్రు సినిమా ఇప్పటి తరం తప్పక చూడాలి.

పి.ఎస్: ఇరుగుపత్రు అంటే గట్టిగా పట్టుకో అని అర్థం. బంధాలను గట్టిగా పట్టుకుంటేనే నిలబడతాయి. నిలబెడతాయి కూడా.

-కె. శోభ
ఫ్యామిలీ కౌన్సిలర్
9849588181

RELATED ARTICLES

Most Popular

న్యూస్