Saturday, November 23, 2024
HomeTrending Newsగత వైభవం కోసం కాంగ్రెస్ అడుగులు

గత వైభవం కోసం కాంగ్రెస్ అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టిడిపి – జనసేన పార్టీలు కలిసి వెళుతుండగా, YSRCP ఒంటరిగా బరిలోకి దిగనుంది. పొత్తులపై స్పష్టత ఇవ్వని బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు అధికం. ఈ దఫా కాంగ్రెస్ కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత అధఃపాతాళానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన ద్వారా సీమాంద్రులకు అన్యాయం చేసిందన్న ఆగ్రహంతో… పదేళ్లుగా హస్తం గుర్తు వైపు ఓటర్లు కన్నెత్తి చూడలేదు. 2014 ఎన్నికల్లో కొందరు పోటీ చేసినా ఘోర పరాజయం చవి చూశారు. చీపురుపల్లిలో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ, పత్తికొండలో కంగాటి లక్ష్మినారాయణ రెడ్డిలు మినహా… కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికీ డిపాజిట్లు దక్కలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఉనికి చాటుకునేందుకు అన్నట్టుగా అభ్యర్థులను పోటీలో నిలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నేతలు రాజకీయ ప్రాభవం కోల్పోయి కనుమరుగయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్లో కొందరు ఇతర పార్టీల్లో చేరగా మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సాకే శైలజానాథ్, మాజీ ఎంపిలు చింతా మోహన్, హర్షకుమార్ తదితరులు… వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత నేతలు పార్టీలో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఏపి వ్యవహారాల ఇంచార్జ్ గా మనిక్కం టాగూర్ ని నియమించి రాష్ట్ర నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఏపి కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం(జనవరి-15) రాజీనామా చేశారు. వెనువెంటనే YS షర్మిలకు ఏపి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ ఆశలు మొలకెత్తాయి. బీఆర్ఎస్ అధినేత సెంటిమెంటుతో మరోసారి గెలవాలని చూసినా ప్రజలు తిరస్కరించారు. పదేళ్ళ కాల క్రమంలో ఏపిలో కూడా అదే రీతిలో కాంగ్రెస్ పట్ల ప్రజల ఆలోచనా సరళిలో మార్పు వస్తుందని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ధీమాతో ఉన్నారు. సత్తా కలిగిన అభ్యర్థులను బరిలో దింపితే సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని భరోసాతో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు ఈ దఫా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ అధికంగా కనిపిస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్