కోలీవుడ్ లో కమల్ తరువాత వైవిధ్య భరితమైన పాత్రలకి ప్రాధాన్యతను ఇచ్చే కథానాయకుడిగా విక్రమ్ కనిపిస్తాడు. పాత్రకి తగిన లుక్ తో కనిపించడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. సాధారణంగా తెరపై హ్యాండ్సమ్ గా కనిపించడానికే హీరోలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రయోగాల పేరుతో అందుకు భిన్నంగా కనిపిస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని భావిస్తూ ఉంటారు. కానీ విక్రమ్ అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంటాడు. ‘ఐ’ సినిమాలోని ఆయన పాత్రను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆ సినిమా తరువాత కూడా విక్రమ్ తన ప్రయోగాలను కొనసాగిస్తూనే వెళ్లాడు. జయాపజయాలను పట్టించుకోకుండా తన దారిలోనే తాను దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన పూర్తి భిన్నమైన కథానేపథ్యం కలిగిన సినిమా చేశాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరే ‘తంగలాన్’. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇంతవరకూ విక్రమ్ కనిపిస్తూ వచ్చిన లుక్స్ .. గెటప్స్ వేరు, ఈ పాత్రలో ఆయన కనిపించే విధానం వేరు. ఇలాంటి ఒక పాత్రలో ఇలా కనిపించడానికి నిజంగానే చాలా ధైర్యమే కావాలి.
ఇది కర్ణాటక ప్రాంతంలోని కోలార్ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం నేపథ్యంలో నడిచే కథ. తమ ఉనికిని .. తమ బతుకుని కాపాడుకోవడం కోసం అక్కడి కార్మికులు చేసే పోరాటంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కథాకథనాలు ఏమిటనే విషయం అలా ఉంచితే, విక్రమ్ లుక్ మాత్రమే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశంగా మారింది. ఆయన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది ఈ సంక్రాంతికి తేలిపోనుంది.