చంద్రబాబు లాంటి గుంటనక్కలు శాంతిభద్రతలను బ్రేక్ చేయాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పుంగనూరు, అంగళ్లు లో ఏం జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంక సీబీఐ, ఎఫ్‌బీఐల విచారణ అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు డైరెక్షన్ మేరకే పుంగనూరు కుట్ర జరిగిందని, అడ్డంగా దొరికి దబాయిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు. ఆరోజు టీడీపీ ఆరాచక మూకల చేసిన దాష్టీకాన్ని రాష్ట్రమంతా చూసిందన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా బిహేవ్ చేయవచ్చా అంటూ సజ్జల ప్రశ్నించారు. పోలీసులను బట్టలూడదీయ్ అన్నాక బాబు నాయకుడు ఎలా అవుతాడని, ఆయనపై 307 కేసు కాకుండా ఇంకేం పెట్టాలని అడిగారు. రాష్ట్రమంతా తగులబడాలనేదే చంద్రబాబు ప్లాన్ అని, ఎన్ని నరబలులు జరిగితే అంత మేలు అనేదే బాబు సిద్ధాంతమని ధ్వజమెత్తారు. జగన్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేకనే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అంగళ్లు వద్ద వివాదానికి ముందే పుంగనూరులో ఇలాంటివి అల్లర్లు చేయాలని ప్లాన్ చేసుకున్నారనేది తెలుస్తోందని… కోల్డ్ బ్లడెడ్‌గా ప్రీ ప్లాన్డ్‌గా రాళ్లు ఇతర సామాగ్రితో ఎలా అటాక్ చేశారన్న విషయం రాష్ట్ర ప్రజలంతా గమనించాలని కోరారు.
జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వందలసార్లు నల్ల జెండాలు చూపుతూనే ఉన్నారని, ఆయన నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లతో కడిగిన సందర్భాలూ ఉన్నాయని, జగన్ వచ్చే ముందు నిరసనగా డోర్లు వేసుకున్న సంఘటనలు జరిగాయని… ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతం వెళితే ఎక్కడో ఒక చోట నిరసన తెలుపుతూనే ఉన్నారని, దాన్ని ఆసరాగా తీసుకుని తమ నాయకుడు, పార్టీ శ్రేణులు అలా సీన్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని అన్నారు.
చిరంజీవి తన మాటల ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు. ఆయన ఏ సందర్భంలో ఏమన్నారో, బాబు హయాంలో బాలకృష్ణకు ఒక న్యాయం..మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు చేయలేదని వెల్లడించారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడటం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడో ఆయనకే తెలియాలని స్పందించారు. రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే క్లియర్‌గా మాట్లాడాల్సింది అంటూ చిరంజీవికి సజ్జల సూచించారు.