Friday, November 22, 2024

మనం తినే విషం

చిలుక కొరికిన పండు తియ్యన. ఆ పండు రుచే రుచి . చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు…మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. చిలుక ప్రత్యేకత అది. నృసింహ శతకంలో అడవిపక్షులకెవడు ఆహారమిచ్చెను ? అని ప్రశ్న . అడవి పక్షుల ఆహారం గురించి తరువాత సంగతి. ముందు జనారణ్య పక్షులమయిన మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకుంటే వీధివీధికి కార్పొరేటు ఆసుపత్రులు మూడు బెడ్లు ముప్పైమంది రోగులుగా ఎందుకు క్షణక్షణప్రవర్ధమానమవుతున్నాయో అర్థమవుతుంది.

కడుపుకు అన్నం తింటున్నారా…గడ్డి తింటున్నారా? అన్నది తిట్టు. సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. ఇందులో పచ్చి గడ్డి, ఎండు గడ్డి రెండు రకాలు. మనుషులు సాధారణంగా గడ్డి తినరు. తినకూడదని రూలేమీ లేదు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో స్వేచ్ఛల్లో ఏ ఆహారం తినాలన్నది కూడా ఒక స్వేచ్ఛ. ఫలానాదే తినాలని నియమం లేదు కాబట్టి కొందరు నానా గడ్డి కరుస్తుంటారు. అయితే- ఈ తిట్టులో అన్నానికి ప్రాధాన్యం, గడ్డికి నీచార్థం రావడాన్ని కొన్ని తెలివయిన పశువులు అనాదిగా అంగీకరించడం లేదు. తమకు ప్రాణాధారమయిన గడ్డిని అంత గుడ్డిగా ద్వేషించాల్సిన పనిలేదన్న పశువుల అభ్యంతరం సమంజసమయినదే. అలాగే కడుపుకు గడ్డి తినడం అలవాటు చేసుకున్న మనుషులు కూడా అనాదిగా అంగీకరించడం లేదు.

మనం కడుపుకు అన్నం తింటున్నామనుకుంటూ విషం తింటూ ఉంటాం. పున్నమినాగు సినిమాలో రోజూ అన్నంలోకి చుక్క విషం కలుపుకుని తినడంవల్ల హీరోను పాము కరిచినా…పాము చస్తుందే కానీ...హీరోకు ఏమీ కాదు. అలా రోజూ మనం నానా గడ్డి కురుస్తున్నా…కాలకూట విషమే తింటున్నా…శరీరానికి అలవాటైపోవడంవల్ల బతికి బట్టగట్టకలుగుతున్నామేమో!

మనం తినే గింజలను పండించే రైతులు కూడా పురుగుల మందులు, ఎరువుల ఘాటుకు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాసకోశవ్యాధులతో ఆసుపత్రులచుట్టూ తిరుగుతున్నారు. భారతీయ వైద్య పరిశోధన మండలి, జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం ప్రకారం తెలంగాణ పొలాల్లో మోతాదుకు మించి పురుగులమందులు చల్లుతున్నారు. యూరియా వాడకం కూడా అధికంగా ఉంది. ఈ పురుగులమందుతో పంటకు చీడపీడలు పట్టకపోవడం తరువాత సంగతి. వాటిని చల్లుతున్నప్పుడు ఆ ఘాటుకు రైతులే స్పృహదప్పి పడిపోతున్నారు. రబ్బరు గ్లౌజుల్లేకుండా నేరుగా చేత్తో మందులు, యురియాలు చల్లడంవల్ల రైతుల చేతుల చర్మంమీద మచ్చలు పడుతున్నాయి. కాపు చేతికొచ్చేలోపు రైతు మంచాన పడి ఉంటున్నాడు.

జీవవైవిధ్య శాస్త్రవేత్తలు చెప్పిన ఒక మాట- పుచ్చులున్న కాయల్లోనే మంచివి ఏరుకోవాలట. నిగనిగలాడే పళ్లు కాకుండా నాలుగురోజులు కాగానే మచ్చలు పడే పండ్లు; మెత్తబడే పండ్లు బాగున్నపుడు (మనంకాదు – పండ్లు) తినాలట. లేకపోతే పురుగులుకూడా ముట్టని కాయలు , పళ్లు మనం తింటున్నందుకు – పురుగులు పడకుండానే పోతార్రా ! అని పురుగులు కూడా మనల్ని శపిస్తాయట!

పైరుమీద స్ప్రే చేసేప్పుడు రైతే స్పృహదప్పి పడిపోయేంత పురుగులమందులను ఆ పంటద్వారా అక్షరాలా మనం తింటున్నామన్న సంగతి బయటెక్కడా చెప్పకండి. నలుగురూ నవ్విపోతారు! ఆనోటా ఈనోటా విని…పురుగులు కూడా పడి పడి నవ్వుకుంటాయి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్