మోసపు వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నేడు విడుదల చేసిన నిఫెస్టోలో మోడీ ఫొటో పెట్టుకోవద్దని ఢిల్లీ నుంచి బిజెపి వారు చెప్పారంటేనే చంద్రబాబు విశ్వసనీయత ఏమిటో, ఆయన ఎలాంటి అబద్ధాల హామీలతో వస్తున్నారో అర్ధం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగిస్తూ బిజెపి-టిడిపి-జనసేన కూటమి నేడు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక, మోడీ ఫొటో లేకపోవడం లాంటి అంశాలపై స్పందించారు.
కూటమిలో మూడు పార్టీలు ఉండి, ఎన్నికల ప్రణాళికలో ముగ్గురి ఫొటోలు కూడా లేకుండా విడుదల చేశారంటే బాబు ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి బరితెగించారో ఆలోచించాలని కోరారు.
2014 ఎన్నికల్లో కూడా బాబు-మోడీ- పవన్ ఫోటోలతో ప్రణాళిక విడుదల చేసి దానిలో ఒక్కటీ అమలు చేయలేదని అందుకే ఈసారి తమ ఫొటో వద్దని చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు.
వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మరాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు మెరుగు పడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క సీటు కూడా తగ్గడానికి వీలు లేదన్నారు.