తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కలిసి రాక పోగా వికటించటం కమలనాథులను కలవరపరిచింది. సీమాంద్ర ఓటర్లు ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రభావం చూపకపోవటం…జనసేనాని పవన్ కళ్యాణ్ కుదురుగా ఉండి అభ్యర్థుల గెలుపునకు వ్యూహ రచన చేయలేకపోయారని బిజెపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులపై కమలం నేతలు స్పష్టత ఇచ్చారు. లోకసభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శుక్రవారం(15 డిసెంబర్) ప్రకటించారు.
కూకట్ పల్లిలో బిజెపికి పట్టు ఉన్నా జనసేనకు కేటాయించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచటంలో పవన్ కళ్యాణ్ విఫలం అయ్యారని…లోకసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఏ రెండు సీట్లు కేటాయించినా బిజెపికి నష్టమని భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేయకపోవచ్చు. ఎన్నికల బరిలో దిగినా ఎవరో ఒకరు ఆయా రాం… గయా రాం నేతలు తప్పితే ఎవరు జనసేన పార్టీని ఎంచుకోకపోవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏపిలో జనసేనతో బిజెపి పొత్తు ఉండకపోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ పలితాలే ఏపిలో పునరావృతం అవుతాయని భావిస్తున్నారు. నిలకడలేని పవన్ కళ్యాణ్ ప్రకటనలు పోత్తులకు మేలు చేయకపోవచ్చని కమలం నేతలు భావిస్తున్నారు. బిజెపి కన్నా టిడిపితో కలిసి ఎన్నికలకు వెళితేనే గట్టెక్కుతామని పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపిలో వస్తాయని…టిడిపితో ఉంటే ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామని అంచనాతో ఉన్నారు. దీంతో టిడిపిపై ఎవరు విమర్శలు చేసినా…ఆ పార్టీ నేతల కన్నా ముందు పవన్ ఎదురుదాడి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో టిడిపితో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాన్ కొద్దిరోజులుగా పలుమార్లు ప్రకటించారు. సైకిల్ తో సవారి నచ్చని నేతలు ఎవరైనా ఉంటే తమ దారి చూసుకోవచ్చని పవన్ సెలవిచ్చారు. దీంతో జనసేనలోని పలువురు కాపు నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాపులకు ఆగర్భ శత్రువుగా భావించే కమ్మ సామాజిక వర్గంతో అంటకాగటం… సుతారము ఇష్టం లేని నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాల కాపు నేతలు టిడిపితో కలిసి ఎన్నికలకు వెళితే లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారని వాపోతున్నారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే వామపక్షాలు, బిజెపి, కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తాత్కాలికమేనని… అవసరం తీరగానే చంద్రబాబు ఒంటెద్దు పోకడలు భరించలేమని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా కాకుండా టిడిపి కార్యకర్తగానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల కేటాయింపు సమయంలోనే చంద్రబాబు నైజం ఏంటో అనుభవంలోకి వస్తుందని…ఇదే పరిస్థితి కొనసాగితే జనసేన టికెట్ల పంపిణీలో కూడా జోక్యం చేసుకుంటారని హెచ్చరిస్తున్నారు.
-దేశవేని భాస్కర్