తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని కాంగ్రెస్ సభా పక్ష నాయకుడు, మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం అన్నారు. ‘‘పీపుల్స్‌మార్చ్’’ పాదయాత్రలో తమ గోడు వెల్లబోసుకుంటున్నారని చెప్పారు. బడుగు బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఏకరువు పెడుతూ భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఈ రోజు లేఖ విడుదల చేశారు.
లేఖలోని ముఖ్యాంశాలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి మీరు, టీఆర్‌ఎస్ పార్టీ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. కులాలవారీ జనగణన చేసి వివరాలు సేకరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నా బయటకు ప్రకటించడం లేదు. ఇదంతా జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభిత్వం చేస్తున్న కుట్రలో భాగమే.
తెలంగాణ ఏర్పడిన నాటినుంచి బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర కేబినెట్ లో మూడు పదవులు ఇచ్చి దులుపుకున్నారు. ఈ చర్యలతో మీరు బీసీలను అనగదొక్కుతున్నారని అర్థం అవుతోంది.
రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో, ఖర్చుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 2023-24 లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 90 వేలకోట్లు కాగా అందులో కేవలం 5 శాతం మాత్రమే బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించారు. 2018-2019 లో బీసీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం 5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2022-23 లో కూడా పరిస్థితి అదే.
దళిత బంధు తరహాలో ‘‘బీసీ బంధు’’ పథకం ప్రారంభిస్తామని గతంలో మీరు శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. ఈ హామీ నీటి మీద రాతగానే మిగిలింది తప్ప కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా వున్న బీసీల అభివృద్దికి పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017 వ సంవత్సరంలో అసెంబ్లీలో మీరు చెప్పిన మాటలు శుష్క వాగ్ధానంగానే మిగిలింది. బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వ హామీ అమలై వుంటే బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో రూ.10 వేల కోట్ల నిధులు అదనంగా సమకూరేవి.
2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్ అలంకారప్రాయంగా మారింది. ప్రతి బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు మీ ప్రభుత్వం గప్పాలు కొట్టింది. కానీ 2017`18 నుండి 2021-2022 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు కేటాయించిన బడ్జెట్‌కు జరిగిన ఖర్చుకు అసలు పొంతనేలేదు. 2018-19 లో 75 శాతం, 2020-22 సంవత్సరాల్లో 100 శాతం నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీలను నిట్టనిలువునా మోసగించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంబీసీల కోసం గత నాలుగు బడ్జెట్లలో రూ. 3000 కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగం ఆమోదం పొందింది నామమాత్రమే. దానిలో ఖర్చు చేసింది చాలా తక్కువ.
బీసీల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని, వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ రాజకీయపరమైన నియామకాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.
మీరు హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికైనా బీసీ బంధు పథకాన్ని ప్రకటించి తగిన నిధులు ఇచ్చి అమలు చేయాలని, అర్హులైన ధరఖాస్తుదారులందరికీ సత్వరమే సబ్బిడీ రుణాలు మంజూరు చేయాలని, 2014, 2018 ఎన్నికలతో పాటు ఇతర సందర్భాల్లో మీరు, బిఆర్‌ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని అమలు చేయాలని, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపట్ల ఉన్న చిన్నచూపును విడనాడలని పక్షంలో బీసీల తరుపున కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.