రాష్ట్రంలో అసలు ప్రాజెక్టులు అంటే గుర్తొచ్చే పేరు దివంగత నేత వైఎస్సార్ అని, ఆ తర్వాత ఆయన తనయుడు, సిఎం జగన్ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఇక్కడకు వచ్చారని, ఆయన శంఖుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. ఫలానా ప్రాజెక్ట్ తన వల్లే వచ్చిందని చెప్పుకునే దమ్ము, ధైర్యం బాబుకు లేవన్నారు. కడపలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాయలసీమలో జన్మించి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని, ఆయనే రాయలసీమ ద్రోహి అంటూ మండిపడ్డారు. పులివెందులలో చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడారని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ ప్రాంతంలో పర్యటించాలని తాము చేసిన డిమాండ్ కూ ఆయన స్పందించలేదన్నారు.
సీమ వాసులు దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే, ఎంతమంది అడ్డుకున్నా, తనకు రాజకీయ భిక్ష పెట్టిన రైతుల కోసం ఎందాకైనా వెళ్తానని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 40వేలకు పెంచిన ఘనత డా. వైఎస్సార్ దేనని గుర్తు చేశారు. సీమలోని ప్రతి ఎకరానికీ నీరు అందించాలని వైఎస్ తపించారని కొనియాడారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు నీరు వస్తుందంటే ఆ మహానేత పుణ్యమేనని అన్నారు.
ఇప్పుడు సిఎం జగన్ మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 80 వేల క్యూసెక్కులకు ఈ సామర్హ్ద్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నది ఎవరని నిలదీశారు. నాడు పోతిరెడ్డిపాడు సమయంలో తన ఎమ్మెల్యేలు దేవినేని, ఉమా, నాగం జనార్ధన్ రెడ్డి లతో ధర్నా చేయించింది కూడా చంద్రబాబేనని దుయ్యబట్టారు.
నలభై ఏళ్ళ చరిత్రలో ఏనాడూ టిడిపి గెలవలేదని, పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, వారు కూడా ఈ ప్రాంతాని, జిల్లాను వారి గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారని పాషా అన్నారు.