Movie ticket rates in AP: కక్ష సాధింపుకైనా ఓ హద్దు ఉండాలని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు ద్వారా ఈ పరిశ్రమపై తన ప్రతాపం చూపి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ప్రజలకు ఏదో మేలు చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి అసలు పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. అధికారులు తనిఖీల పేరుతో దాడులు చేస్తుంటే ఎగ్జిబిటర్లు విధిలేని పరిస్థితుల్లో థియేటర్లు మూసేస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పటికే 125 సినిమా థియేటర్లు మూత పడ్డాయని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది పొట్ట కొడుతున్నారని విమర్శించారు.
తనకూ ఒకప్పుడు థియేటర్ ఉండేదని, ఇప్పుడు అమ్మేసుకొని ఉండొచ్చని, అందుకే థియేటర్ ఓనర్ల బాధలు తనకు స్వయంగా తెలుసని సోమిరెడ్డి చెప్పారు. ‘వి ఎపిక్’ పేరుతో సూళ్ళూరు పేటలో ఓ మల్టీ ప్లెక్స్ నిర్మించారని, ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉందని, మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోపు ఉందన్న నెపంతో ‘సి’ గ్రేడ్ కింద ఒక్కో టికెట్ 20, 10 రూపాయలు అమ్మాలని నిబంధన పెడితే ఆ థియేటర్ ను స్వచ్చందంగా మూసివేశారని సోమిరెడ్డి వివరించారు. దానికి సమీపంలో షార్, శ్రీసిటీ, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వారంతా వినోదం కోసం మద్రాసు వెళ్ళాల్సి ఉంటుందని, వారి సౌకర్యం కోసం 40-50 కోట్ల ఖర్చుతో ఏడెకరాల స్థలంలో ఇంత పెద్ద మల్టీ ప్లెక్స్ కడితే ఈ రేట్ల వల్ల మూసివేశారని సోమిరెడ్డి వెల్లడించారు. సినిమా రంగాన్ని దెబ్బతీయాలని చూస్తే ప్రజలే జగన్ కు సినిమా చూపిస్తారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సిఎం తన పంతాన్ని వీడి ఈ విషయంలో పునరాలోచన చేయాలని హితవు పలికారు.
Also Read : రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధ : అనిల్