Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్యా వ్యవస్థపై వక్రీకరణలా?: సిఎం అసహనం

విద్యా వ్యవస్థపై వక్రీకరణలా?: సిఎం అసహనం

విద్యావ్యవస్థను బాగుచేసి, పిల్లలకు మంచిచేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ అందించేందుకు, వారికి ట్యాబ్ లు ఇవ్వాలని నిర్ణయిస్తే, దీన్నికూడా వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాయడంపై సిఎం అసహనం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం చదవలేక పిల్లలు మానేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని… మంచి మాటలు చెప్పి పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వారు ఇలా వక్రీకరించడం వెనుక వారి ఉద్దేశం ఏమిటని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాబ్ ల పంపిణీపై అధికారులు సిఎం కు వివరాలు అందించారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, వీటిలో లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే వస్తున్నాయని తెలిపారు. ట్యాబ్‌లు వచ్చాక దాంట్లోకి కంటెంట్‌ను లోడ్‌ చేసే పనులుకూడా వెంటనే మొదలు కావాలని సిఎం సూచించారు. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్‌పై వారికి అవగాహన కల్పిస్తామని, బైజూస్‌ ఇ-కంటెంటును 4వ తరగతి నుంచి 10వ తరగతివరకూ అందిస్తామని, ట్యాబ్‌లు పొందలేని వారు కూడా తమ సొంత ఫోన్లలో ఈ కంటెంటును డౌన్లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. దీంతోపాటు పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్‌ పొందుపరచాలని,  డిజిటల్‌ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్‌ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. మార్కెట్లో బయట వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా వారి వారి సెల్ఫోన్‌లో  డౌన్లోడ్‌ చేస్తున్నామన్నారు.

నాడు– నేడు రెండో దశ పనులు, 2023–24 విద్యాసంవత్సరం విద్యా కానుక,  జగనన్న గోరుముద్ద పథకాలపై సిఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకొని అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, స్టేట్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ మనోహరరెడ్డి,  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌(ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఇంటింటా వెలుగులు నింపాలనే: సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్