విభజన కంటే జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరే విషయమై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రచారం చేస్తున్నవారే సమాధానం చెప్పాలని నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. గతంలో కూడా ఏపీ ప్రయోజనాల విషయంలోనే బిజెపితో విభేదించి ఎన్డీయే నుంచి బైటకు వచ్చామని గుర్తు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బాబు ఇష్టా గోష్టి సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కంటే పాలనపైనే ఎక్కువగా దృష్టి సారించడంతో రెండు సార్లు పార్టీ ఓటమి పాలైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మంచి పేరు తీసుకురావాలనే తపన తో తాను కూడా వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయానని ఆవేదన వెలిబుచ్చారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని, తాము అధికారంలోకి వస్తే ఇంత కంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమం అందిస్తామని ధీమాగా చెప్పారు. సంక్షేమం గురించి ఏమాత్రం అవగాహన లేనివారు తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనతో ప్రజల్లో ఎంతో ఆవేదన ఉన్నా నాడు తెలంగాణా కంటే ఏపీలోనే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందించామన్నారు.
Also Read : చంద్రబాబు కొత్త పార్టీ: కొడాలి సంచలన వ్యాఖ్యలు