After Plenary: జూలై 8న దివంగత నేత వైఎస్ ఆర్ జయంతి రోజున పార్టీ ప్లీనరీ జరుగుతుందని, ఆ తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విస్తరణ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించిట్లు తెలిసింది. నేడు అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్-1 లో పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ప్రస్తావించారు. పదవులు పోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు, రీజినల్ కోర్డినేటర్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సిఎం జగన్ ఈ భేటీలో అనేక అంశాలను ప్రస్తావించారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయిన ఎమ్మెల్యేలు ఇకపై నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని జగన్ సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద పక్కా సమాచారం ఉందని, కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించిన జగన్ వారు తమ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇకనుంచి ప్రతిరోజూ సమీక్షిస్తానని, వారి ప్రతి కదలికా నమోదవుతుందని తేల్చి చెప్పారు.
గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించే దిశగా తాను పనిచేస్తున్నానని, ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం మొదలుతుందని, 8నెలలపాటు కొనసాగుతుందని జగన్ వివరించారు.
Also Read : సిఎం జగన్ కు టిటిడి ఆహ్వానం