వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుది మెరుగులు దిద్దుతున్నారు. వారంరోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు నేడు విరామం ఇచ్చారు. నిన్నటి యాత్ర ముగిసిన తరువాత మధురవాడలో ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేశారు. నేటి ఉదయం ఉంచి క్యాంపులో పార్టీ సీనియర్ నేతలతో జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98శాతం వరకూ అమలు చేసిన నేపథ్యంలో ఈసారి ఏయే అంశాలు పొందుపరచాలనేదానిపై చర్చిస్తున్నారు. ఒక్కసారి హామీ ఇస్తే దాన్ని నెరవేర్చి తీరుతారనే నమ్మకం సిఎం జగన్ పై ప్రజల్లో ఏర్పడిందని… అందుకే కీలకమైన అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చి, వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తయారు చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమంతో పాటు ఈ ఎన్నికల్లో అభివృద్దికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చేర్చాలని యోచిస్తున్నారు.
రేపు విశాఖ, విజయనగరం జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. 24న శ్రీకాకుళం జిల్లా టూర్ తో మేమంతా సిద్ధం యాత్ర ముగియనుంది. ఆ మరుసటిరోజు 25న పులివెందులలో తన నామినేషన్ పత్రాన్ని సమర్పించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈనెల 28 నుంచి మలివిడత ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. హెలీకాఫ్టర్ ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. 26,27 తేదీలను మేనిఫెస్టో విడుదల కోసమే రిజర్వ్ చేసుకున్నారని తెలుస్తోంది.