బాబు అనుకుంటే ఈ జగన్ చనిపోడని.. తనను ప్రజలు, దేవుడు రక్షించుకుంటారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. “నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక.. చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా గతంలో బాబు అన్న మాటలు
తాను మర్చిపోనని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగిస్తూ జగన్ ను చంపేస్తే తప్పేమిటంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనమని, ఆయన మానసిక స్థితిపై అందరూ ఆలోచన చేయాలని కోరారు. బాబు మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉందో అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. వెన్నుపోట్లు, మనుషులను చంపడమే చంద్రబాబు రాజకీయమన్నారు. ఎన్టీఆర్, వంగవీటి రంగాలను కుట్రలతో చంపింది ఎవరు?, ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపిందెవరు.. అంటూ ప్రశ్నించారు. బాబు లాంటి వ్యక్తులను ప్రజలు ఎవరైనా నమ్మగలరా అని నిలదీశారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలే, దీవెనలే తనకు శ్రీరామరక్ష అని భావోద్వేగంతో అన్నారు.