వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితులు అర్థమయ్యాయని, మనం ఎంత వెనుకబడ్డామో తెలుసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మన గురించి నిరంతరం ఆలోచించే జగనన్న మనలందరినీ ప్రేమతో అక్కున చేర్చుకున్న ఆత్మబంధువు అని అభివర్ణించారు. తనవల్ల మంచి జరిగివుంటే..నాకు ఓటు వేయండి అంటున్న జగనన్నలాంటి నాయకుడు దేశంలో మరొకరంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు. సూళ్ళూరుపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. “జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు, పేదవారు చేసుకున్న అదృష్టం. జగనన్నను మళ్లీ గెలిపించుకుంటే, ముఖ్యమంత్రిని చేసుకుంటే..మన జీవితాలు ఇంకా ..ఇంకా బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది” అంటూ నారాయణస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారని కానీ సామాజిక,రాజకీయ రంగాల్లో ప్రతి ఒక్కరికీ వాటా ఉండాలని భావించడమే కాకుండా, ప్రతి రంగంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు, మహిళలకు 50శాతం భాగస్వామ్యం కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విజయవాడ నడిబొడ్డున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిలిపి, నిరంతర స్ఫూర్తిగా ఉండేలా చేశారని కొనియాడారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించి ..పేదల ఆత్మగౌరవం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఇప్పుడెవరూ ఏ కార్డుకో, ఏ పథకానికో అఫీసుల చుట్టూ తిరగాల్సిన ఖర్మ లేదని వ్యాఖ్యానించారు. మనకు ఏం కావాలో కనుక్కుని మరీ..మరీ ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చే అద్భుత వ్యవస్థను సృష్టించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం అంజాద్ భాషా,. ఎంపి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.