Sunday, November 24, 2024
HomeTrending Newsరాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం: నడ్డా పిలుపు

రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం: నడ్డా పిలుపు

దేశంలో తొమ్మిదేళ్ళ మోడీ పాలన అభివృద్దే ప్రధాన అజెండాగా సాగిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని ఎప్పుడూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేయలేదన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన బిజెపి జన సంపర్క్ అభియాన్ సదస్సులో నడ్డా ప్రసంగించారు. మంగళగిరిలో ఎయిమ్స్ ను 1620 కోట్ల రూపాయలతో మోడీ ప్రభుత్వంలోనే శంఖుస్థాపన చేసి మళ్ళీ 2022లో దాన్నిజాతికి అంకితం కూడా చేశామని తెలిపారు.  ఏపీ అభివృద్ధిలో మోడీ ప్రభుత్వ పాత్ర ఎంతగానో ఉందని, విశాఖలో జరిగిన సభ ద్వారా ప్రధాని మోడీ 10,500 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మొన్ననే రాష్ట్రానికి ­10,463 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నిధులు విడుదల చేశామన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 300 కోట్ల రూపాయలు కేటాయించామని, తిరుపతిలోనే ఐఐటి కూడా మంజూరు చేశామని వెల్లడించారు.

రాష్ట్రంలో బిజెపి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేస్తోందని, అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని, కానీ ఏపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధంకావడం లేదని అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని నడ్డా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం రేయిబవళ్ళు  పనిచేస్తుంటే జగన్  ప్రభుత్వం మాత్రం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. లిక్కర్, మైనింగ్, ఎడ్యుకేషన్ రంగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మోడీ స్వయంగా వచ్చి శంఖుస్థాపన చేశారని, కానీ ఇప్పుడు ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని నడ్డా విస్మయం వ్యక్తం చేశారు. అమరావతి-బెంగుళూరు రాజధానికి; ఇన్నర్ రింగ్ రోడ్ కు నిధులు మంజూరు చేసినా పనులు ముందుకు సాగడం లేదన్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, అరాచక పరిస్థితులు నెలకొన్నాయని  విరుచుకుపడ్డారు.

కేంద్ర పథకాలకు రాష్ట్రం వాటా కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పారదర్శకతకు పెద్ద పీట వేస్తుంటే ఇక్కడ మాత్రం సంపాదనకే మొగ్గుచూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్యకర్తలు కృషి చేయాలని, తద్వారా మోడీ తరహా పాలనను రాష్ట్రంలో కూడా తీసుకు రావాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్