రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలు తిరగబడితేనే జగన్ ప్రభుత్వం తోక ముడుస్తుందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా టిడిపి నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులు బైట పడతాయనే టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేసినందుకు పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేశారని, దేవాలయానికి వెళ్తే గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టాలని చూశారని, ఇది దారుణమని అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులపై సాక్ష్యాధారాలు సేకరిస్తారనే భయంతో మా నేతల ఫోన్లు కూడా లాక్కుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా తమ పార్టీ నేతలపై కేసులు పెడుతూనే ఉన్నారని, కానీ ఏమీ సాధించలేకపోయారని మండిపడ్డారు. టిడిపి నేతలపై కేసులు పెట్టడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం నేతలు ఆత్మ స్థైర్యం తో ఉన్నంత వరకూ ప్రభుత్వం ఏమీ చేయలేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, కానీ ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని అయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పడ్డామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి పనిచేస్తోందన్నారు. బీసీలకు 56, ఎస్సీలకు 3 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి తామేదో గొప్పలు చేశామని చెప్పుకుంటున్నారని, కానీ రెండేళ్లుగా వారి అభ్యున్నతికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.