Saturday, November 23, 2024
HomeTrending Newsఎమ్మెల్యేలకు బదిలీలా?: చంద్రబాబు విస్మయం

ఎమ్మెల్యేలకు బదిలీలా?: చంద్రబాబు విస్మయం

రాబోయే ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని…రాజకీయ పార్టీలు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా త్యాగాలకు సిద్ధంకావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. ఐదుకోట్ల ప్రజలు- జగన్ మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తన 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. 11 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లను మారుస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని బాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్ధులను మారుస్తున్నారని, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉండడం తొలిసారి చూస్తున్నానన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో బాబు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, సిఎం పాలనలో ఘోరంగా విఫలమయ్యారని, ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చిందని, భయంకరంగా శాపనార్ధాలు పెడుతున్నారని, ఇది గ్రహించే అభ్యర్ధుల మార్పులు చేస్తున్నారని అన్నారు. ఒంగోలులో బాలినేని, కాకినాడలో ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చాయని వారిని ఎందుకు మార్చలేదని, ఎస్సీ అభ్యర్థులనే ఎందుకుకు మార్చారని…దోపిడీదారులు మీ సామాజికవర్గం వారు అయి ఉంటే వారిపై చర్యలు తీసుకోరా బాబు ప్రశ్నించారు. మొత్తం 175 మందిని మార్చినా వైసీపీ  గెలిచే పరిస్థితి లేదని, జనవరి తర్వాత పరిస్థితిలో ఇంకా పెద్దఎత్తున మార్పు వస్తుందని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ పాలన ప్రజలకు అర్ధం అయ్యిందని, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత నష్టపోయారో గ్రహించారని, మార్పు మొదలైందని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలే ఎదురు చూస్తున్నారని అన్నారు.  బిసిలపై అంత ప్రేమ ఉంటే పులివెందుల సీటు వారికి ఇవ్వాలని, జగన్ వేరే చోట పోటీ చేయాలని బాబు సూచించారు.

ఇచ్చిన హామీ నెరవేర్చాలని అంగన్ వాడీలు డిమాండ్ చేస్తుంటే వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తామని హెచ్చరించడం సమంజసం కాదని, ఎవరైనా పోరాటం చేస్తే ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలని, అణచివేయాలని చూడడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధుల ఎంపికకు ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా ఉంటుందని, కుప్పంలో కూడా ప్రజల అభిప్రాయాల మేరకే టికెట్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు పంపిన అభిప్రాయాన్ని స్వయంగా తానే పర్యవేక్షించి వారు కోరుకున్న వారికే సీటు ఇస్తామని వెల్లడించారు.

ఇటీవల సంభవించిన మిచ్ గాం తుఫాను సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, తుపాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేకపోయిందని, ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని… పరిహారం అంచనా వేయడంలో కూడా అలసత్వం ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ వస్తే ఏం చేయాలో కూడా ఈ సిఎంకు తెలియదన్నారు. గతంలో అన్నమయ్య,  గుండ్లకమ్మ ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, ఎనిమిది కోట్ల రూపాయల పనికి టెండర్లు పిలిస్తే ఒక్క కంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అన్ని రంగాలూ నిర్వీర్యం చేశారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్