Sunday, September 8, 2024
HomeTrending NewsTDP: కులగణన రాజ్యంగబద్ధంగా జరగాలి: అచ్చెన్నాయుడు

TDP: కులగణన రాజ్యంగబద్ధంగా జరగాలి: అచ్చెన్నాయుడు

బలహీనవర్గాలను రాజకీయంగా ఉక్కుపాదంతో అణచివేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే దానిపై పోరాడుతున్నందుకు టిడిపిలో ఉన్న బిసి నేతలపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ‘బిసిల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ‘ పేరిట ఓ పుస్తకాన్ని విడుదల చేసి అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నాలుగేళ్ల 8 నెలల తరువాత ఇప్పుడు సిఎం జగన్.. నా బలహీన వర్గాలు అంటూ మాట్లాడుతున్నారని, కానీ ఇప్పటివరకూ వారు బిసిలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. తమ హయంలో 400 కోట్ల రూపాయలతో 9౦ శాతం ప్రభుత్వం భరించి, కేవలం 10శాతమే లబ్దిదారులు కట్టేలా ఆదరణ పథకం తీసుకువస్తే దాన్ని నిలిపి వేశారని, బిసిలు వారు కోరుకున్న పరికరాలు కొనుగోలు చేసి వాటిని ఆయా ప్రాంతాల్లో గౌ డౌన్ లకు పంపామని, ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చిందని, వాటిని ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని వివరించారు.

బిసిలకు 10 శాతం రిజర్వేషన్ తగ్గించారని, దీనివల్ల 16 వేల రాజకీయ పదవులు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బిసిలకు విదేశీ విద్య, స్టడీ సర్కిల్ లాంటి వాటిని ఆపేశారని దుయ్యబట్టారు. 54 కార్పొరేషన్లు పెట్టామని భజన చేసుకుంటున్నారని, కానీ వాటికి నిధులు, విధులు, అధికారాలు ఇవ్వలేదని అన్నారు.  తాము బిసి ఫెడరేషన్ లకు ఇచ్చిన నిధులు కూడా వెనక్కు తీసుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రాల్లో బిసి భవన్ లకు తమ ప్రభుత్వంలో స్థలాలు ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ జీవోలు కూడా ఇచ్చామని కానీ జగన్ అధికారంలోకి రాగానే ఆ భూములు వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు.

తాము అధికారంలోకి రాగానే బిసిలకు మరింత మేలు చేయాలని ఎన్నో పథకాలు అమలు చేయబోతున్నామని, సూపర్ సిక్స్ లో కూడా బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకు వస్తున్నట్లు చెప్పమని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ అవకాశాలు దక్కని బిసి కులాలకు ప్రాధాన్యత ఇస్తామని  అచ్చెన్న హామీ ఇచ్చారు.

మరో నాలుగు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వానికి గడువు ఉందని, ఈ సమయంలో కుల గణన అంటే ప్రజలు నమ్మబోరని, కేవలం బిసిల ఓట్లు తీసివేసేందుకే ఈ గణన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.  తమ మేనిఫెస్టోలో కూడా బిసిలకు ఎన్నో తాయిలాలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. కుల గణన అనేది రాజ్యాంగ బద్ధంగా, కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాల్సిన కార్యక్రమమమని, దానికి టిడిపి కట్టుబడి ఉందని, కానీ వాలంటీర్లతో ఈ ప్రక్రియ నడిపిస్తే ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్