వెంటిలేటర్ పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయని, సిఎం జగన్ ఎన్నడూ ముందస్తుపై ఆలోచన చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే 2024లోనే ఎన్నికలు జరుగుతాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ జగన్ సిఎం పీఠం దక్కుతుందని, బాబు-పవన్ లవి పగటి కలలేనని అన్నారు. వైఎస్ జగన్ నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నేటికి నాలుగేళ్ళు నిండిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశంలో లేరని… ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.
బాబు-పవన్ ల కలయికపై స్పందిస్తూ అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికే వారిద్దరూ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపికి దగ్గర కావాలని టిడిపి చూస్తోందని అన్నారు. పందికొక్కులు- గుంటనక్కలు ఏకం కావడాన్ని ప్రజలు గమనించాలని ఘాటుగా విమర్శలు చేశారు. బలమైన జగన్ ను ఎదుర్కొనేందుకు వీరంతా ఒక్కటవు తున్నారని కానీ జగన్ ప్రజా బలం ముందు వీరు నిలవలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించడం విచిత్రంగా ఉందని, బిజెపి కూడా కలిస్తే అప్పుడు ఎవైఖరి తీసుకుంటాయని సజ్జల ప్రశ్నించారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది కలిసినా మంచిదేనని, అందరినీ ఒకేసారి ఓడించే అవకాశం జగన్ కు వస్తుందని అన్నారు.