Friday, October 18, 2024
HomeTrending News15 శాతం హామీలే నెరవేర్చారు: అచ్చెన్న

15 శాతం హామీలే నెరవేర్చారు: అచ్చెన్న

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం 15 శాతం మాత్రమే సిఎం జగన్ అమలు చేశారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాజీనామా చేసి వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నవరత్నాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బహిరంగ సభల్లో ప్రజలకు ఎన్నో హామీలు జగన్ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ 15 శాతమే నెరవేర్చారని విమర్శించారు. “జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్” అనే పుస్తకాన్ని మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రాజకీయ నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలంటూ గతంలో జగన్ చెప్పిన విషయాన్ని అచ్చెన్న గుర్తు చేశారు. 99శాతం హామీలు అమలు చేశామని జగన్ చెబుతున్నదానిలో వాస్తవం లేదని, మొత్తం 730 హామీలు ఇచ్చి 109 అమలు చేశారని వివరించారు. హామీల అమల్లో జగన్ వైఫల్యాన్ని ప్రజల్లో ఎండగడతామని, జనవరి 5 నుంచి 29 వరకూ  పార్లమెంట్ స్థాయిలో స్థాయిలో సభలు పెట్టి వివరిస్తామని వెల్లడించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికలకు వెళ్తామని చెప్పిన జగన్ ఇప్పుడేమి చెబుతారని నిలదీశారు.

ఆర్టీసీని జగన్ సర్వనాశనం చేశారని, తమ పాలనలో ప్రతియేటా 250 కోట రూపాయలతో కొత్త బస్సులు కొన్నామని, కానీ ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం ఒక బస్సు కూడా కొనలేదని, బస్సులు అన్నీ తీసేశారని, కేవలం డొక్కు బస్సులు మాత్రమే ఉన్నాయని, ఆర్టీసీ నిధులు కూడా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పగానే, ఓడిపోయే సమయంలో తానూ ఇస్తానంటూ జగన్ చెబుతున్నారని, అసలు బస్సులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తలకిందులుగా తపస్సు చేసినా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అచ్చెన్న స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్