ఐదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ సిఎం జగన్ మద్దతు పలికారని, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు తాము ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తుంటే విమర్శలు చేసే హక్కు వారికి ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మైనార్టీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పలమనేరులో జరిగిన రోడ్ షో లో బాబు ప్రసంగించారు.
జగన్ ఐదేళ్ళ పాలనలో ఏమి నష్టపోయారో ప్రజలందరూ తెలుసుకోవాలని బాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసిందెవరో గుర్తించాలని.. ప్రజల భవిష్యత్తును కాపాడడానికే తాను కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అహంకారంతో సిఎం జగన్ అన్ని రంగాలనూ నాశనం చేశారన్నారు. ఒకనాడు రాయలు ఏలిన రాయలసీమ రాత్నాలసీమగా ఉండేదని… దాన్ని రాళ్ళ సీమగా మార్చారని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో ఎడారిగా మారిందని విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టును తాము 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేక సాగునీటితో పాటు తాగునీటికి కూడా కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాలనలో పదో తారీఖున అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా అని బాబు ప్రశ్నించారు. నిన్నటి వరకూ పరదాలతో తిరిగిన జగన్ ఇప్పుడు బస్సులో యాత్రకు బయల్దేరారని… రాయలసీమకు ద్రోహం చేసిన జగన్ ను రావడానికి వీల్లేదని ప్రజలు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు. డబ్బులు వసూలు చేయడానికి, దోచుకోవడానికి సలహాదారులను నియమించుకున్నారని ధ్వజమెత్తారు.
చిలకలూరిపేటలో ప్రజా గళం యాత్ర మొదలుపెట్టిన తరువాత పలమనేరులోనే బహిరంగసభ నిర్వహించామని… ఈ సభ సూపర్ హిట్ అయ్యిందని…. మిట్టమధ్యాహ్నం రెండు గంటలు అవుతున్నా ప్రజలు ఇంత పెద్దఎత్తున రావడం చూస్తుంటే.. మీ మనసు అంతా తెలుగుదేశం పార్టీతోనే ఉందని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని కోరారు.
తాము అధికారంలోకి రాగానే సంపద సృష్టించి పేదలకు మరింత సంక్షేమం అందిస్తామని… అందుకే సూపర్ సిక్స్ పేరిట పథకాలు ప్రవేశపెట్టామని, వాటిని అమలు చేసి తీరుతామని, పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకొని పనిచేస్తామని స్పష్టం చేశారు.