తన రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నో ఎన్నికలను చూశానని కానీ ఐదేళ్ళ పాలన నచ్చితేనే తనకు ఓటు వేయమని చెప్పిన జగన్ లాంటి వారు ఏ ఒక్కరూ లేరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, పాలనా రంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విప్లవాత్మకమైనవని అభివర్ణించారు. బొత్స నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకొని పోలింగ్ నాడు, ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదు చేసింది.
జూన్ 4న ఎన్నికల ఫలితాల అనంతరం 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలో అంగరంగ వైభవంగా జరుగుతుందని బొత్స వెల్లడించారు. అలా జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ తర్వాత ఎక్కడకు వెళ్ళినా మళ్ళీ జగన్ రావాలి, పెన్షన్ ఒకటో తారీఖునే అందాలని అవ్వా తాతలు అంటున్నారన్నారు. ఫలితాలపై తెలుగుదేశం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్నారు. జగన్ చేసేదే చెబుతారు, చెప్పిందే చేస్తారని, మంచి జరిగే నిర్ణయాలానే తీసుకుంటారని కితాబిచ్చారు. మొదటినుంచీ తాము చెబుతున్న 175కి 175 లక్ష్యానికి అతి చేరువలో సీట్లు సాధించబోతున్నామని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
హింసను ప్రేరేపించటం తమ అభిమతం కాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సంప్రదాయం కాదన్న భావనతోనే తాము ఉపెక్షిస్తున్నామని, లేకపోతే పరిస్థితులు దారి తప్పుతాయని… మళ్ళీ ఏర్పడబోయేది మా ప్రభుత్వమే కాబట్టి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని అందుకే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. నాలుగైదురోజులు తాము సంయమనం పాటిస్తే అంతా సర్దుకుంటుందని… ఆ తర్వాత మేమే వస్తాము కాబట్టి అప్పుడు తోక ముడిచి పిల్లుల్లా వారే సర్డుకున్తున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ లాంటి నేత లేకపోతే కష్టాలు వస్తాయని… మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయని, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, దోపిడీ జరుగుతుందనే భావనతోనే ప్రజలు పెద్దఎత్తున ముందుకు వచ్చి ఓటు వేశారని, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని వివరించారు.