ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చాక అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసి, బడుగుబలహీన వర్గాలకు అంతో ఇంతో చేశారని కానీ ఎవరూ ఊహించని రీతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్లలో మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్‌లుగా అవకాశం కల్పించారని, పేదలకు డీబీటీ ద్వారా దాదాపు రూ.2.4లక్షల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారని, పేదల బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు.
రాయచోటిలో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతమైంది. నియోజకవర్గం నలుమూలల నుంచి జనం వేలాదిగా తరలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కొరుముట్ల శ్రీనివాసులు ప్రసంగించారు.
అనిల్ కుమార్ మాట్లాడుతూ… ఇక ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వని అత్యధిక పింఛన్లు అవ్వాతాతలకు జగన్ అందించబోతున్నారని, ప్రతి సంక్షేమ పథకం పేదల గడపల దగ్గరకే వస్తోందని, నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోందని వివరించారు. ప్రేమించే మనసు, స్పందించే గుండె ఉన్న ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని ప్రశంసించారు.
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ సిఎం అయ్యాక పేదలకు మంచి జరగాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలకు జగనన్న వల్ల జరిగిన మేలును తలచుకోవడం. తెలుసుకోవడమే సామాజిక సాధికార యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. రాయచోటి నియోజకర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో రూ.1289 కోట్ల ప్రయోజనం కలిగించారని తెలిపారు.
పెనమలురులో…
టీడీపీ మేనిఫెస్టో గురించి, తమ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చకు తాను రెడీగా ఉన్నానని, చంద్రబాబుగానీ, అచ్చెన్నాయుడుగానీ సిద్ధమా అంటూ గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. రైతుల్ని రుణమాఫీ పేరుతో, డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్కచెల్లెమ్మల్ని, నిరుద్యోగభృతి ఇస్తానని, ఇంటికో ఉద్యోగం యువకులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని, ముందు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చెప్పారు. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు. మనకెక్కడ గ్యారెంటీ ఇస్తాడు?, దొంగలకు చంద్రబాబుకు తేడా లేదు. వీళ్లను తరిమి కొట్టాలని కోరుతున్నాం” అంటూ పిలుపు ఇచ్చారు.
పెనమలూరులో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, హఫీజ్ ఖాన్, ఉదయభాను, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు పంచే అవకాశం తనకు దక్కిందని ఎమ్మెల్యే పార్థసారథి సంతోషం వ్యక్తం చేశారు. కాలువ కట్టల మీద ఇళ్లు పీకేస్తారని ప్రజలు భయాందోళనలకు గురైతే వారికి విద్యుత్, తాగునీటి వసతి కల్పించి భరోసా ఇచ్చామన్నారు. పేదవాడికి జీవితం మీద భరోసా కల్పించడం కూడా అభివృద్ధేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రూ.1,763 కోట్లు ఆర్థిక సాయం అందిందని, 75 శాతం రోడ్లను నిర్మించుకున్నామని, కంకిపాడులో గొడవర్రు రోడ్డు, మెయిన్ రోడ్డు వేయించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.