Saturday, November 23, 2024
HomeTrending Newsనేరుగా ఎదుర్కోలేకే పొత్తులు: బాబుపై జగన్ ఫైర్

నేరుగా ఎదుర్కోలేకే పొత్తులు: బాబుపై జగన్ ఫైర్

రాబోయే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదని… జమ్మిజట్టు మీద దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందారులపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరో ఐదేళ్లపాటు ఈ ప్రయాణం కొనసాగిద్డామని, ‘సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం, ఓ ప్రజా సముద్రం’ అని అభివర్ణించారు. బాపట్ల జిల్లా అడ్డంకి సమీపంలోని మేదరమెట్లలో జరిగిన సిద్ధం బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న తనకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

అరడజను పార్టీలు మనకు వ్యతిరేకంగా… కొన్ని పొత్తులు పెట్టుకొని వస్తున్నాయని…  పొత్తుపెట్టుకున్న పార్టీలకు సైన్యాధికారులే కానీ సైన్యం లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు…  రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పార్టీలు,  ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఆ వైపున ఉన్నాయని విమర్శించారు. 2014లో ఈ మూడు పార్టీలే కలిసి పోటీ చేశాయని… కానీ అప్పుడు వారు ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా అని జగన్ ప్రశ్నించారు.

ఒకప్పుడు జాతీయ రాజకీయాలు ఏలానని, స్టీరింగ్ తిప్పానని…. చెప్పుకున్న చంద్రబాబు.. తమకున్న ప్రజాబలం ముందు నిలబడలేక… సైకిల్ చక్రం తిప్పలేక, దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీ వెళ్లి మోకరిల్లారని దుయ్యబట్టారు. చిత్తశుద్ది, నిజాయితీతో మనం పని చేశాము కాబట్టే మనల్ను నేరుగా ఎదుర్కోలేక పొత్తుల కోసం పాకులాడుతున్నారన్నారు. తనకు పదిమంది స్టార్లు ఎవరూ లేరని, ప్రజలు, తమ వల్ల లబ్ధి పొందిన పేదలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.

తమ కార్యకర్తలు రాష్ట్రంలో ప్రతి గడప తొక్కి సంక్షేమం అందించి వారి బాగోగులు చూస్తుంటే, బాబు మాత్రం ఎల్లో మీడియా అధిపతుల గడపలు.. ఢిల్లీలో రాజకీయ నేతల గడపలు తొక్కుతున్నారన్నారు. మన ఫ్యాన్ కు కరెంట్ ప్రజల అభిమానం, మనం చేసిన మంచి నుంచి వస్తుందన్నారు.  సైకిల్ కు ట్యూబ్, టైర్లు లేవని అందుకే ఈ తుప్పుబట్టిన సైకిల్ తోయడానికి  వేరేవాళ్ళను తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా తాము తలపడబోతున్నామని, ఈ సంగ్రామానికి మీరంతా సిద్ధమేనా?… జగన్ ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం చేస్తున్న ప్రయాణాలకు  మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. బిందువు బిందువు సింధువు అయినట్లుగా… మేదరమెట్లలో మహా సముద్రాన్ని తలపిస్తోందన్నారు.

టిడిపి ఎన్నికల వరాలపై కూడా జగన్ స్పందించారు. నేరుగా నరకంలోకి రమ్మంటే రారు కాబట్టి గేటు దగ్గర స్వర్గం చూపించి లోపాలకు వెళ్లిన తరువాత నరకం చూపించినట్లు… చంద్రబాబు కూడా వాగ్దానాలు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎవరు వచ్చినా తప్పనిసరిగా అమలు చేయాల్సిన వాటికి ఏటా 52.700 కోట్ల రూపాయలు కావాలని, ఇవి గాక బాబు ఇచ్చిన హామీలకు 87,312 కోట్లు ఖర్చవుతాయని.. మొత్తం లక్షా నలభై వేల కోట్లు ప్రతియేటా కావాల్సి ఉంటుందని జగన్ వివరించారు. పరిస్థితి ఇలా ఉంటే బాబు పేదలకు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని… అబద్ధాలకు హద్దులెందుకు…, భావ దారిద్ర్యం ఎందుకన్న ఉద్దేశంతోనే బాబు వాటినే నమ్ముకున్నారని ఫైర్ అయ్యారు.

పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్ననే మళ్ళీ తెచ్చుకోవాలన్న విషయాన్ని ప్రతి గడపకూ వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు జగన్ విజ్ఞప్తి చేశారు.  పేదలకోసం నిలబడ్డ తనపై అర డజను పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయని… కానీ తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. త్వరలో తమ మేనిఫెస్టో విడుదల చేస్తామని, చేసేదే చెబుతామని.. జగన్ మాట ఇస్తే తగ్గేదే లేదని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్