జగన్ పరిపాలనలో రైతులు అల్లాడుతున్నారని, అసలు వ్యవసాయరంగంపై ఈ సిఎంకు ఏమాత్రం అవహాగన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వ్యవసాయ శాఖను మూసివేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలనలో లాభసాటిగా మారిన సాగు ఒక్క గంజాయి మాత్రమేనని దుయ్యబట్టారు. రాయలసీమలో హార్టీ కల్చర్ ను ప్రోత్సహించామని, ఉత్తరాంధ్రలో జీడి పప్పు బస్తా 15 వేలు ఉంటే, ఇప్పుడు 7 వేలకు పడిపోయిందని, ఆక్వా సాగు లక్షా 40 వేల హెక్టార్లు ఉంటే దాన్ని 2 లక్షలకు పెంచామని, 72 వేల రూపాయలు ఉండే సీడ్ ధర 91 వేలకు పెరిగిందనని, వాటర్ సెస్ 12 రూపాయలుంటే 120కు పెంచారని అంటే 12 పక్కన సున్నా పెట్టారని అన్నారు. ‘సాగును చంపేశారు, రైతును ముంచేశారు, జగన్ చేతగాని అసమర్ధ పాలన వల్లే రైతులకు ఈ అవస్థలు’ అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారని, , కరోనా సమయంలో కూడా కష్టపడి అందరికీ అన్నం పెట్టిన రైతులను ఆదుకోలేని జగన్ కు సిఎంగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. కరోనా కంటే సిఎం అసమర్ధ పాలన రైతులను ఎక్కువగా వేధిస్తోందని, ‘పంట పండించలేము, పండిస్తే అమ్ముకోలేము’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
లోటు వర్షపాతం నమోదైతే ఇంతవరకూ సిఎం జగన్ సమీక్ష చేయలేదని, గతంలో వరదలు వచ్చి అన్నదాతలు అల్లాడినా పట్టించుకోలేదన్నారు. తమ హయంలో పులివెందులలోని సింహాద్రిపురం మండలం అరటి సాగులో రికార్డు సాధించిందని గుర్తు చేశారు. తమ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 11 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టి 5.8 శాతం ఈ రంగానికి కేటాయించామని, కానీ దాన్ని 4.16 శాతానికి తగ్గించారని వెల్లడించారు. ఇరిగేషన్ రంగానికి రంగానికి 64వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని 62 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిలో 24 పూర్తి చేశామని, 32 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణ చేశామని, కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరు అందించామని గణాంకాలు వివరించారు. జల జీవన్ మిషన్ లో కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించుకోలేదని కేంద్ర జల్ శక్తి మంత్రి చెప్పారన్నారు.
రైతులకు కనీసం ధాన్యం బస్తాలు కూడా ఇవ్వలేని దారుణ పరిస్థితి నెలకొని ఉందని, ఏపీలో రైతు పరితితి వెంటిలేటర్ మీద ఉన్నట్లు తయారైందని, కౌలురైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, అసలు రైతులపై ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. మోసకారి జగన్ ను రైతాంగం ఎప్పటికీ క్షమించడానికి వీల్లేదని, రైతు బతకాలి అంటే జగన్ పోవాల్సిందేనని అన్నారు.